రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని డిసెంబరు నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆమె స్థానంలో కొత్త వారిని నియమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సీనియారిటీ జాబితా ప్రకారం ప్రస్తుత సీఎస్ భర్త అజయ్ సాహ్ని, సమీర్ శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం ఉన్నారు. అయితే వీరంతా కేంద్ర సర్వీసుల్లో ఉండటంతో పాటు రాష్ట్రానికి వచ్చేందుకు ఎవరూ సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని సీనియర్ అధికారుల నుంచే ఈ నియామకం జరిగేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. సీనియర్ అధికారులు సతీష్ చంద్ర, జేఎస్వీ ప్రసాద్, నీరబ్ కుమార్ ప్రసాద్‌లలో ఒకరిని సీఎస్‌గా నియమించేందుకు ప్రభుత్వం సుముఖంగా లేనట్టు తెలుస్తోంది.
రేసులో ఆదిత్యనాథ్!
సీనియర్ అధికారిగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ పేరును ఏపీ కొత్త సీఎస్‌గా ఖరారు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ కూడా ఆయన వైపే మొగ్గు చూపిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ కొనసాగుతున్నారు. బీహార్ రాష్ట్రానికి చెందిన దాస్ 1987 బ్యాచ్‌కు చెందిన అధికారి. ఆయన విజయవాడ, విజయనగరం అసిస్టెంట్ కలెక్టర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు.
డిసెంబరు నెలాఖరున నీలం సాహ్ని పదవీ కాలం ముగిసే రోజున కొత్త సీఎస్ నియామక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న ఆదిత్యనాథ్ దాస్ ఇప్పటికే కీలకమైన ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన అంశాల్లోనూ పాల్గొంటున్నారు.
ఇదీ చదవండి
'జగనన్న జీవక్రాంతి' పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి