కొవిడ్ నుంచి కోలుకున్న వారందరూ ప్లాస్మా థెరపీకి ముందుకు రావాలని... వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఐసియూలో ఉన్న కొవిడ్ రోగుల ప్రాణాల్ని కాపాడటంలో సహాయకారిగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కొవిడ్ బాధితుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు చివరి అస్త్రం ప్లాస్మా థెరపీ అని ఆయన వివరించారు. వ్యాధి నిరోధక శక్తి పెరగడం వల్ల త్వరగా కొవిడ్ పేషెంట్లు కోలుకుంటారని వెల్లడించారు.
తిరుపతిలోని స్విమ్స్, కర్నూలులోని జీజీహెచ్లలో ప్లాస్మా థెరపీకి ఐసీఎమ్మార్ అనుమతి ఇచ్చిందని జవహార్ రెడ్డి తెలిపారు. జీజీహెచ్ విజయవాడ, గుంటూరులలో ప్లాస్మా థెరపీ అనుమతి కోసం ఐసీఎమ్మార్కు విజ్ఞాపన పంపించామని తెలిపారు. ప్లాస్మా ను తీసే విధానంలో ఆపోహలొద్దని స్పష్టం చేశారు. కోలుకున్న కొవిడ్ పేషెంట్ల రక్తం పైనున్న ద్రవంలాంటి ప్లాస్మాని మాత్రమే తీస్తారని వివరించారు.