ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ విడుదల ఎప్పుడో..? - job replacement calendar in AP

ఉద్యోగాల భర్తీ క్యాలెండర్​ను ఉగాదికి విడుదల చేస్తామంటూ ప్రభుత్వం ఇచ్చిన హామీపై అయోమయం కొనసాగుతోంది. ఆర్థిక శాఖ నుంచి ఉద్యోగాల భర్తీకి అనుమతి రాకపోవటంతో... క్యాలెండర్ జారీ ప్రక్రియలో జాప్యం నెలకొంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఏర్పడిన ఖాళీలపై ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కసరత్తు జరిగినా... ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్సు రాని కారణంగా దాన్ని నిలిపివేశారు. సీఎం పదవి చేపట్టి రెండేళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలో... ఈ ఏడాది మే 30న క్యాలెండర్​ను విడుదల చేసే అవకాశాలన్నాయి.

ఉద్యోగాల భర్తీ క్యాలెండర్
ఉద్యోగాల భర్తీ క్యాలెండర్

By

Published : Apr 15, 2021, 5:13 AM IST

ప్రభుత్వ ఉద్యోగాల క్యాలండర్ విడుదల అంశం వెనక్కు వెళ్తూనే ఉంది. ఈ ఏడాది ఉగాది రోజున ఉద్యోగాల క్యాలండర్ విడుదల చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటించినా.. ఆర్థిక శాఖ నుంచి ఇంకా క్లియరెన్సు రాక విడుదలను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. అయితే సీఎం జగన్ తాను పదవి చేపట్టిన రెండో వార్షికోత్సవం రోజైన మే 30న నియామక క్యాలెండర్ ప్రకటించాలని భావిస్తున్నట్టు సమాచారం. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలపై ఇప్పటికే సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ నేతృత్వంలోని కమిటీ కసరత్తు చేసింది.

రెవెన్యూ శాఖలో 670 కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు, సూపరింటెండెంట్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. పశుసంవర్థక శాఖలో 6,100 ఖాళీలు, పోలీసు శాఖలోనూ 6 వేల పైచిలుకు కానిస్టేబుళ్లు, ఎస్ఐల పోస్టులు ఖాళీ ఉన్నాయి. 18 వేల పైచిలుకు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. సచివాలయంలోనే వెయ్యికిపైగా ఏఎస్ఓలు, అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లను నియమించాల్సి ఉంది. అసెంబ్లీ, ఆర్థిక విభాగం... ఇలా వేర్వేరు శాఖల్లో వందలాది మంది అసిస్టెంట్, సెక్షన్ అధికారులను నియమించాల్సి ఉంది. క్లాస్-4 విభాగంలో నియమాకాలు పూర్తిగా నిలిచిపోయాయి. రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాయాల్లో వేలాది పోస్టులు ఖాళీ అయినప్పటికీ.. భర్తీ చేసేందుకు మాత్రం ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 90 వేల మందికిపైగా అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిన ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలన్నిటినీ తాత్కాలిక ప్రాతిపదికన అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు విధానంలోనే భర్తీ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఉద్యోగ నియామకాల క్యాలెండర్ వాయిదా పడుతూనే వస్తోంది. వాస్తవానికి 2018-19 సంవత్సరంలో ఏపీపీఎస్సీ వేర్వేరు కేడర్లలో 3 వేల పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ తర్వాత కనీసం ఒక్క పోస్టుకు ఏపీపీఎస్సీనుంచి నోటిఫికేషన్ రాలేదు. వాస్తవానికి 2019లో 1.2 లక్షల మందిని గ్రామ, వార్డు సచివాలయంలో ప్రభుత్వం నియమించింది. ఇందులోనూ దాదాపు 8 వేల ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. ఈ ఖాళీల భర్తీ కోసం లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.

ఇదీ చదవండీ... ఉగాది రోజున ఏపీపీఎస్సీ క్యాలెండర్​ విడుదల చేయనున్న సీఎం!

ABOUT THE AUTHOR

...view details