ఉత్తర, తూర్పు గాలులు.. కోస్తా, రాయలసీమ ప్రాంత ప్రజల్ని వణికించేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు కంటే 4 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. బుధవారం అత్యల్పంగా విజయనగరంలో 8.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గుంటూరు, కృష్ణా, అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లోనూ చలి ప్రభావం అధికంగానే ఉంది. బుధవారం గుంటూరు జిల్లా జంగమహేశ్వపురంలో 11 డిగ్రీలు, కళింగపట్నం, ఆమదాలవలస 11.8, బాపట్ల 12.3, అనంతపురం 13, అమరావతిలో 13.3, విజయవాడలో 14.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో రాత్రి 8 గంటల నుంచే చలిగాలులు మొదలవుతున్నాయి. ఉదయం 10 గంటలైనా కొన్ని చోట్ల చలి తీవ్రత తగ్గడం లేదు.
వారం నుంచి చలి తీవ్రత అధికం
రాష్ట్రంలో డిసెంబరు 1 నుంచే చలి తీవ్రత అధికమైంది. నవంబరు చివరి వారంతో పోలిస్తే.. సగటున 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గాయి. తర్వాత చలి ప్రభావం కాస్త తగ్గినా.. గత వారం రోజులుగా మళ్లీ పెరిగింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. కనిష్ఠంగా విజయవాడలో 1970 డిసెంబరు 14న, 2010 డిసెంబరు 22న 13 డిగ్రీలుగా నమోదైంది. 2013 సంవత్సరంలో 14 డిగ్రీలు నమోదుకాగా.. ఇప్పుడు అదే స్థాయికి ఉష్ణోగ్రతలు తగ్గాయి.
ఉత్తరభారతం నుంచి చలిగాలులు
- స్టెల్లా, డైరెక్టర్, వాతావరణ కేంద్రం, అమరావతి