రాష్ట్రంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తరువాత కాస్త.. స్తబ్ధుగా ఉన్న పరిణామాలు.. వేగంగా మారుతున్నాయి. గడిచిన కొద్దిరోజుల్లోనే ప్రభుత్వానికి పలు సమస్యలు సవాల్ విసురుతున్నాయి. 'న్యాయస్థానం నుంచి దేవస్థానం' పేరుతో అమరావతి రైతుల పాదయాత్రకు కదం తొక్కారు. ఒకదశలో సర్కార్ అనుమతి ఇవ్వకపోవటంతో.. కోర్టును ఆశ్రయించి అనుమతి పొందారు. జిల్లాల మీదుగా సాగుతున్న ఈ యాత్రను ఆంక్షల పేరుతో పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.
పెట్రో మంటలు.. వైకాపా వర్సెస్ ప్రతిపక్షాలు
పెట్రో ధరల విషయంలోనూ రాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారుతోంది. దీపావళి సందర్భంగా కేంద్రంలోని భాజపా సర్కార్.. పెట్రోల్‌పై రూ.5, డీజిల్ పై రూ.10లను తగ్గించింది. ఈ పరిణామం... రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా మారింది. కేంద్రం రేట్లు తగ్గించిన పరిస్థితుల్లో.. రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్‌ను వెంటనే తగ్గించాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో ఓ అడుగు ముందుకేసిన భాజపా రాష్ట్ర నాయకత్వం.. సర్కార్‌పై యుద్ధాన్ని ప్రకటించింది. ప్రభుత్వ తీరును ఖండిస్తూ 2 రోజల నిరసన కార్యక్రమాలను భాజపా నేతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించకపోతే.. ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. తెలుగుదేశం, జనసేన పార్టీలు.. ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నాయి. మంగళవారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు కూడా పిలుపునిచ్చారు తెదేపా అధినేత చంద్రబాబు.
'పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పూర్తిగా రద్దు చేస్తామని జగన్ అన్నారు. హామీ ప్రకారం పెట్రోల్‌పై రూ.16, డీజిల్‌పై రూ.17 తగ్గించాలి. అనేక రాష్ట్రాలు తగ్గించినా ఏపీలో మొండిచేయి చూపారు. పెట్రో ధర ఎక్కువున్న రాష్ట్రానికి పరిశ్రమలు, ఉద్యోగాలు రావు. డీజిల్ ధర వల్ల ఖర్చు పెరిగి వ్యవసాయం దెబ్బతింటుంది'- చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ అధినేత
ఇక వామపక్ష పార్టీలు.. కేంద్రంలోని భాజపా, రాష్ట్రంలోని వైకాపా సర్కార్‌ను టార్గెట్ చేస్తున్నాయి. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత పెంచిన పెట్రో, డీజిల్ ధరలను తగ్గించాలని.. రాష్ట్ర సర్కార్ కూడా వ్యాట్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
'భాజపా అధికారం వచ్చిన నాటి నుంచి 40 రూపాయల వరకు పెట్రోల్ ధరలు అధికమయ్యాయి. దసరా ఆఫర్ లా పది రూపాయలు తగ్గించటమేంటి..? చిత్తశుద్ధి ఉంటే ఆ మొత్తాన్ని తగ్గించాలి. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై వైకాపాకు చిత్తశుద్ది ఉంటే కేంద్రాన్ని నిలదీయాలి' - నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి
అయితే ప్రభుత్వ వాదన మరోలా ఉంది. రూ. 40 పెంచి.. నామమాత్రంగా ఐదు రూపాయలను తగ్గిస్తే లాభమేంటని ప్రశ్నిస్తోంది. ఇష్టానుసారంగా కేంద్రమే ధరలు పెంచిందని మంత్రులు ఆరోపిస్తున్నారు. కేంద్రలోని భాజపా సర్కార్.. డ్రామాలు చేస్తోందని ఘాటుగా బదులిస్తున్నారు.
'పెట్రోల్ ధరను రూ.116 వరకు ఎవరు తీసుకెళ్లారు? పెట్రో ధరలు పెంచిన వాళ్లే రోడ్లపై ధర్నాలు చేస్తారా? రూ.70 ఉండాల్సిన పెట్రోల్ ధరను ఎక్కడికి తీసుకెళ్లారు? ప్రజలకు ఏమీ గుర్తుండదని భాజపా నేతలు భావిస్తున్నారా? పెంచిన పెట్రో ధరలు మొత్తం తగ్గించాలి. కొన్ని నెలలుగా వీరబాదుడు బాది ఇప్పుడు రూ.5 తగ్గిస్తారా? రూ.5, రూ.10 ఎందుకు.. లీటర్‌కు రూ.30 తగ్గించాలి ' - పేర్ని నాని, రాష్ట్ర సమాచార శాఖ మంత్రి