పలు ఉద్యాన, నూనెగింజలు, పప్పుధాన్యాల పంటలు సాగుచేసే చేలతో తేనెటీగల పెంపకానికి ప్రత్యేకంగా పెట్టెలు ఏర్పాటు చేయడం ద్వారా పలు లాభాలున్నట్లు ‘భారత నూనెగింజల పరిశోధన సంస్థ’(ఐఐఓఆర్), తెలంగాణ రాష్ట్ర ఉద్యానశాఖ జరిపిన అధ్యయనంలో గుర్తించారు. పొద్దుతిరుగుడు, బత్తాయి, కానుగ, నువ్వులు, కంది తదితర పలు పంటల సాగు చేస్తున్న చేలలో లేక వాటికి పక్క ఖాళీ భూముల్లో తేనెటీగల పెంపకానికి ప్రత్యేకంగా పెట్టెలు పెట్టారు. వీటిలోకి చేరిన తేనెటీగలు తోటల్లో చెట్లపై ఉండే పూలపైకి చేరి పరపరాగ సంపర్కానికి ఉపయోగపడుతున్నాయి. దీనివల్ల పూత నిలబడి కాత అధికమై దిగుబడి 15 నుంచి 30 శాతం దాకా పెరుగుతున్నట్లు ఐఐఓఆర్ పరిశోధనల్లో నమోదు చేశారు.
తెలంగాణలో పొద్దుతిరుగుడు వంటనూనెను అధికంగా వాడుతున్నారు. ఈ పంట సాగు రాష్ట్రంలో పెద్దగా లేదు. కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఈ పంట వేసిన చోట తేనెటీగల పెంపకంతో పొద్దుతిరుగుడు పూలపై గింజల ఉత్పాదకత గణనీయంగా పెరిగిందని ఐఐఓఆర్ శాస్త్రవేత్తలతో పాటు రుతిక ఇన్నోవేషన్స్ అనే స్వచ్ఛంద సంస్థ తేల్చాయి.
చేలలో తేనెటీగల పెంపకానికి పెట్టెల ఏర్పాటు తద్వారా రైతులకు అదనపు ఆదాయం పూలపై పరపరాగ సంపర్కంతో దిగుబడి అధికం నల్గొండ, సంగారెడ్డి జిల్లాల్లోని కొన్నిచోట్ల పంటచేలలో చేపట్టిన తేనెటీగల పెంపకంతో ఎన్నో సత్ఫలితాలు వచ్చాయి. ఈగలు అధికంగా ఉన్న చేలలో పూత, కాత, దిగుబడి పెరిగి రైతులకు అదనపు ఆదాయం వస్తోంది. తేనెటీగలు పెంచితే తెగుళ్లు, రసాయనాల పిచికారి సగానికి తగ్గుతుందని తమ పరిశోధనలో తేలింది. -
- ఇందిరారెడ్డి, రుతిక ఇన్నోవేషన్స్ డైరెక్టర్.