ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సామాన్యులకు సచివాలయంతో పనేంటి ? : ఆళ్ల రామకృష్ణారెడ్డి

"ప్రభుత్వాన్నే ప్రజల ముందుకు తీసుకెళ్తున్నప్పుడు సామాన్యులకు సచివాలయంతో పనేముంటుంది. ఇంట్లో కూర్చుంటే 72 గంటల్లో పనులు పూర్తయ్యే పరిస్థితి ఉంటే శాసనసభ, సచివాలయం, హైకోర్టు ఎక్కడ ఉంటే ఏమవుతుంది. రాజధానిలో రైతులు కోరుకున్నదే జగన్‌ చేసి చూపిస్తున్నారు"

ఆళ్ల రామకృష్ణా రెడ్డి
ఆళ్ల రామకృష్ణా రెడ్డి

By

Published : Jan 20, 2020, 4:16 PM IST

ఆళ్ల రామకృష్ణా రెడ్డి

రాజధానిగా 29 గ్రామాలను ప్రకటించినప్పుడు మొదట సంతోషించానని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. తర్వాత జరిగిన అన్యాయాన్ని గుర్తించామన్నారు. రాజధాని నిర్మాణానికి ప్రభుత్వ భూమి అయితే బాగుంటుందని నాడు జగన్‌ చెబితే దాన్ని వక్రీకరించారని ఆరోపించారు. "చంద్రబాబు నాడు రైతులకు కంటి మీద కనుకులేకుండా చేశారు. కూలీలు, కౌలు రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రాంతం రాజధానికి అనుకూలం కాదని గ్రీన్‌ట్రైబ్యునల్‌ చెప్పినా... వాటిని నాటి ప్రభుత్వం తుంగలో తొక్కింది. అందరి రాజధాని కాదు కొందరి రాజధాని అనేలా అమరావతిని మార్చేశారు. ఏ కమిటీని చంద్రబాబు పట్టించుకోలేదు. జగన్‌ మాత్రం అందరి అనుమతితోనే జరగాలని నిర్ణయం తీసుకున్నారు. కమిటీలు వేశారు. ప్రజల తరఫున ఆనాడు ఎన్నో పోరాటాలు చేశాం. ఆ రోజు పట్టించుకున్న దాఖలాలు లేవు" అని ఆళ్ల వ్యాఖ్యనించారు.

రైతులకు ప్లాట్లు ఇవ్వడంలోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వినియోగానికి రాని భూములను రైతులు అంగీకరిస్తే తిరిగి ఇచ్చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అవసరమైతే అమరావతి ప్రాంతాన్ని అగ్రికల్చర్‌ జోన్‌గా ప్రకటించాలన్నారు. రాష్ట్రాన్ని నియంత్రించే శాసనాలు తయారు చేసే సభ ఇక్కడే ఉండటం మేం చేసుకున్న అదృష్టమని అభివర్ణించారు. "అభివృద్ధిలో కృష్ణా, గుంటూరు జిల్లాలు ముందంజలో ఉన్నాయి. ఈ రెండు జిల్లాల మాదిరిగానే మిగతా జిల్లాలు అభివృద్ధి జరగాలనే నేను వికేంద్రీకరణకు అనుకూలంగా మాట్లాడుతున్నాను. ఆర్థిక భారంతో అల్లాడుతున్న రాష్ట్రానికి సీఎం జగన్ నిర్ణయం మేలు చేస్తుంది. ప్రభుత్వాన్నే ప్రజల ముందుకు తీసుకెళ్తున్నప్పుడు సామాన్యులకు సచివాలయంతో పనేముంటుంది... ఇంట్లో కూర్చుంటే 72 గంటల్లో పనులు పూర్తయ్యే పరిస్థితి ఉంటే శాసనసభ, సచివాలయం, హైకోర్టు ఎక్కడ ఉంటే ఏమవుతుంది. రాజధానిలో రైతులు కోరుకున్నదే జగన్‌ చేసి చూపిస్తున్నారు" అని రామకృష్ణారెడ్డి వ్యాఖ్యనించారు.

ABOUT THE AUTHOR

...view details