జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు ఏవైనా... సోషల్ మీడియా కీలక భూమిక పోషిస్తోంది. పంచాయతీ ఎన్నికలు మొదలు... పార్లమెంటు ఎన్నికల వరకు దాదాపు అన్ని పార్టీలు సామాజిక మాధ్యమాలను సాధ్యమైనంత వరకు ఉపయోగించుకుంటున్నాయి. అందులో కొన్ని పార్టీలు సమర్థవంతంగా వినియోగించుకున్నాయి. భాజపా ఇందులో మొదటి స్థానంలో ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా... భాజపా సోషల్ మీడియా వింగ్ నిరంతరం పనిచేస్తూ... శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తోంది. అంతే స్థాయిలో ప్రజలు ఆలోచించేలా పోస్టులు పెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
తెరాస వర్సెస్ భాజపా..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెరాస- భాజపా మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఇందుకు కారణాలు ఎన్ని ఉన్నా... అందులో ప్రధానమైనది సోషల్ మీడియా. ఇరు పార్టీలు ఎక్కడా తగ్గకుండా తమతమ గొంతును వినిపించేందుకు ఉపయోగించుకున్నాయి. ప్రధానంగా తెరాస, భాజపా ప్రత్యేక వింగ్‌లు ఏర్పాటు చేసుకొని ప్రత్యర్థుల లోపాలను, తమ బలాలను ప్రజల్లోకి, మరీ ముఖ్యంగా యువతలోకి తీసుకెళ్లగలిగాయి. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా... కేసీఆర్, కేటీఆర్, అమిత్ షా, బండి సంజయ్ వ్యాఖ్యలు ట్రోల్‌గా మారాయి.
ఈ వ్యాఖ్యలకు ప్రచారం ఎక్కువ..!
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం అసెంబ్లీ ఎన్నికలను తలపించింది. తెరాసలో కేటీఆర్ అన్నీ తానై నడిపించగా.. భాజపా తరఫున పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా నుంచి... బూత్ లెవల్ మెంబర్ వరకు ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఇరు పార్టీల నేతలు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.