ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఆర్డీఏ భవితవ్యం ఏమిటో? - అమరావతి సీఆర్డీఏ

రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) బిల్లు రద్దుకు గవర్నర్‌ ఆమోదముద్ర వేయడం అన్ని వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. గత జనవరిలోనే ఈ బిల్లును రూపొందించి సీఆర్డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటిన్‌ ప్రాంత అభివృద్ధి సంస్థను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బిల్లుకు గవర్నర్‌ ఆమోదముద్ర పడినందున సీఆర్డీఏ పూర్తిగా రద్దు అవుతుందా.. లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. దీనిపై హైకోర్టులో పలు కేసులు పెండింగ్‌లో ఉన్నందున ఇప్పటికి ఇప్పుడు అమల్లోకి వస్తుందా లేదా అనేది చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సీఆర్డీఏ మనుగడ కృష్ణా, గుంటూరు జిల్లాల వాసులకు ఆసక్తికర అంశంగా మారింది.

what about amaravathi crda future
సీఆర్డీఏ భవితవ్యం ఏమిటో?

By

Published : Aug 1, 2020, 6:24 AM IST

రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని ప్రకటించిన తర్వాత అభివృద్ధి కోసం సీఆర్డీఏను 2014లో ఏర్పాటు చేశారు. తొలుత ఇక్కడ ఉడా (విజయవాడ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) ఏర్పాటు చేశారు. తర్వాత విజయవాడ నగరపాలక సంస్థ, తెనాలి, మంగళగిరి, గుంటూరులను కలపి వీజీటీఎం-ఉడా కింద మార్చారు. దాని తర్వాత సీఆర్డీఏ ఏర్పాటు అయింది. దీనిని మొత్తం 3 వలయాలు.. సీడ్‌ క్యాపిటల్‌, రాజధాని నగరం, రాజధాని ప్రాంతంగా విభజించారు. సీడ్‌ క్యాపిటల్‌లో కేవలం సచివాలయం, పరిపాలన భవనాలు ఇతర కార్యాలయాలు ఉన్నాయి. రాజధాని నగరం పరిధిలో మొత్తం 29 గ్రామాలు ఉన్నాయి. మొత్తం 22 నియోజకవర్గాలను చేర్చారు. కృష్ణా జిల్లాలో నాలుగు, గుంటూరులో 7 నియోజకవర్గాలను మినహాయించి అన్నింటినీ రాజధాని ప్రాంతంగా గుర్తించారు. ఇక్కడ లేఅవుట్లకు, ఇళ్ల నిర్మాణానికి సీఆర్డీఏ నుంచే అనుమతులు తీసుకోవాల్సి ఉంది. అభివృద్ధి ప్రణాళికల్లోనూ దీనిదే కీలక పాత్ర. ఉడా భవనంలోనే ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసి, కార్పొరేట్‌ హంగులు సమకూర్చారు.

ఇక 217 చదరపు కి.మీ. వరకే...

ప్రభుత్వ నిర్ణయం అమలు జరిగితే ఏఎంఆర్‌డీ(అమరావతి మెట్రోపాలిటిన్‌ ప్రాంత అభివృద్ధి సంస్థ) కేవలం 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం వరకు మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. పరిపాలన వికేంద్రీకణ, అభివృద్ధి వికేంద్రీకరణ చట్టంలో భాగంగా అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. భూసమీకరణ పేరును కూడా మార్చుతున్నారు. ఇంతవరకు ఏపీసీఆర్డీఏకు ఉన్న అధికారాలు, విధులు, బాధ్యతలు అన్నీ ఏఎంఆర్‌డీఏకు బదిలీ అవుతాయని బిల్లులో పేర్కొన్నారు. సీఆర్డీఏ జారీ చేసిన బాండ్లు, చేసుకున్న ఒప్పందాలు కూడా కొత్త సంస్థ చేసుకున్నట్లుగా భావించాల్సి ఉంటుంది. రాజధాని రైతులకు ఇచ్చే కౌలు, పింఛన్లు ఇక నుంచి దీని ద్వారానే చెల్లిస్తారు. సీఆర్డీఏ ద్వారా వచ్చే చిక్కుముడులు ఏవైనా ఉంటే రెండేళ్ల గడువులోగా ఏఎంఆర్‌డీఏతో పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. రెండేళ్ల తర్వాత మాత్రం ఆ సంస్థకు సంబంధం ఉండదు.

ఉడా తిరిగి ఏర్పడనుందా!

సీఆర్డీఏ నుంచి కొన్ని నియోజకవర్గాలను మినహాయించి మచిలీపట్నం ప్రాంత పట్ణణాభివృద్ధి సంస్థ (ముడా)లో కలపాలని ఇటీవల మంత్రి పేర్నినాని కూడా విజ్ఞప్తి చేశారు. గన్నవరం వరకు ముడాలో ఉంచాలని కోరారు. ప్రస్తుతం గుడివాడ, గన్నవరం, పామర్రు సీఆర్డీఏ పరిధిలో ఉన్నాయి. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా అన్ని పట్టణాలకు అభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నట్లు చెబుతున్నారు. ఆ ప్రకారం చూస్తే తిరిగి ఉడా ఏర్పడనుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రాజధాని తరలింపు నేపథ్యంలో సీఆర్డీఏ భవితవ్యం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం న్యాయ స్థానాల్లో ఉన్న కేసులపై అమరావతి జేఏసీ ఆశలు పెంచుకుంది. మరోవైపు గవర్నర్‌ ఆమోద ముద్ర వేయడంపై ఆందోళన చేస్తున్నారు.

సీఆర్డీఏ రద్దును అంగీకరించే పరిస్థితి లేదు. రాజ్యాంగం ప్రకారం అది చెల్లదు. శాసన మండలిలో సెలెక్ట్‌ కమిటీకి బిల్లు పంపినప్పుడు గవర్నర్‌తో ఆమోద ముద్ర ఎలా వేయిస్తారు. రాజధాని అమరావతిపై, సీఆర్డీఏపై అంతిమ విజయం రైతులదే. తుదికంటా పోరాడుతాం.-- బచ్చుల అర్జునుడు, ఎమ్మెల్సీ, తెదేపా కృష్ణా జిల్లా అధ్యక్షుడు

రాజధాని ప్రాంతం అభివృద్ధిని విస్మరించి సీఆర్డీఏ రద్దు బిల్లు ఆమోదించడం దారుణం. ఇది అన్యాయం. గతంలోనూ గవర్నర్‌ను జేఏసీ ఆధ్వర్యంలో కలిసి విన్నవించినా ఫలితం లేదు. దీనిపై అన్ని వర్గాలతో కలిసి ఉద్యమిస్తాం. -- ఆర్వీ స్వామి, క్రెడాయ్‌

ఇవీ చదవండి..

గవర్నర్‌ నిర్ణయంపై తీవ్రస్థాయిలో నిరసనలు

ABOUT THE AUTHOR

...view details