Drugs in Radisson Pub: రాడిసన్ బ్లూ పబ్‌లో ఉన్నవారు డ్రగ్స్ తీసుకువచ్చినట్లు, వినియోగించినట్లు తేలలేదని హైదరాబాద్ వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. డ్రగ్స్ కేసులో పబ్‌లో ఉన్నవారిని బాధ్యులను చేయలేదని ఆయన స్పష్టం చేశారు. పబ్‌లో ఉన్నవారి పాత్ర ఉందని దర్యాప్తులో తేలితే అరెస్టు చేస్తామని డీసీపీ వివరించారు. డ్రగ్స్ కట్టడికి తరచూ సమావేశాలు జరుగుతున్నాయన్న డీసీపీ... వీటి కట్టడికి ఉన్నతాధికారులు కఠిన ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. డ్రగ్స్ నిరోధానికి సీపీ సీవీ ఆనంద్ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశారన్నారు. ప్రత్యేకంగా నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ ఏర్పాటు చేశారని వెల్లడించారు.
అవగాహన కల్పిస్తున్నాం:దర్యాప్తులో లోపాలున్నాయని నార్కోటిక్ సూపర్‌వైజరీ వింగ్ ఏర్పాటు చేశారన్న డీసీపీ... ప్రజల్లో అవగాహన కోసం కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. పబ్‌లు, బార్లు, రెస్టారెంట్ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో నిఘా ఉంచుతున్నట్లు డీసీపీ తెలిపారు. ప్రతి జోనల్ డీసీపీ పరిధిలో టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్న డీసీపీ... పుడింగ్ అండ్ మింక్ పబ్.. రాడిసన్ బ్లూ హోటల్‌లో నడుపుతున్నారన్నారు.
రాడిసన్ పబ్ యాజమాన్యం 24 గంటలపాటు పబ్ నిర్వహణకు లైసెన్స్ తీసుకున్నారు. పబ్‌లో డ్యాన్స్‌లు, డీజేలు నిర్వహిస్తున్నారు. పబ్‌లో ఉదయం 4 వరకు మద్యం, ఆహారం విక్రయిస్తున్నారు. పబ్‌లో డ్రగ్స్‌కు సంబంధించి సమాచారం అందింది. అర్ధరాత్రి 2 ప్రాంతంలో పబ్‌పై టాస్క్‌ఫోర్స్ బృందాల దాడి. పబ్‌లో 38 మంది మహిళలు సహా 148 మందిని గుర్తించాం. పబ్‌లో ఐదు ప్యాకెట్లలో 5 గ్రాముల కొకైన్ లభించింది. - జోయల్ డేవిస్, వెస్ట్‌జోన్ డీసీపీ