నేడు, రేపు కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్-దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలో, పశ్చిమ మధ్య, దాన్ని అనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో జులై 11న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఉత్తర బిహార్ నుంచి ఏర్పడిన ఉత్తర దక్షిణ ఉపరితల ద్రోణి.. ప్రస్తుతం ఝార్ఖండ్ నుంచి ఇంటీరియర్ ఒడిశా మీదుగా.. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వద్ద కొనసాగుతోంది. ‘ఉపరితల ద్రోణి ప్రభావంతో గురు శుక్రవారాల్లో కోస్తా ప్రాంతంలో తీరం వెంబడి గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయి. రాయలసీమ, కోస్తాలోని మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు పడతాయి’ అని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు.