రానున్న మూడు రోజుల్లో రాష్ట్రానికి వర్ష సూచన.. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఎస్. స్టెల్లా తెలిపారు. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని చెప్పారు. ఇది మరింత బలపడి 24వ తేదీన తుపానుగా మారే అవకాశముందన్నారు. రేపటి నుంచి 26 వతేదీ వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు.
ఉత్తర కోస్తాంధ్ర, యానాం..
ఈరోజు, రేపు చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ...
ఈరోజు చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. రేపు, ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది.
విశాఖలో ఈ కంట్రోల్ రూం ఏర్పాటు..
తుపాను దృష్ట్యా విశాఖ కలెక్టరేట్‌లో ఈ-కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు కంట్రోల్ రూమ్ నెంబర్లు 0891-2590102, 0891-2590100 లో సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటానికి 100రోజులు.. రాష్ట్రవ్యాప్త నిరసనలు