ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనాకు చిక్కొద్దని.. వ్యవసాయ క్షేత్రాల్లోకి ధనవంతుల మకాం!

బతికుంటే బలుసాకు తినొచ్చు అన్న సామెత ప్రస్తుత పరిస్థితికి సరిగ్గా సరిపోతుంది. హైదరాబాద్‌ నగరంలోని అనేక మంది ధనవంతులు ఇప్పుడిదే ఆలోచిస్తున్నారు. నగర పరిధిలో వైరస్‌ రోజురోజుకు విస్తరిస్తోంది. ఏ రోజు ఏ ఇంట్లో వారు కరోనా బారిన పడతారో చెప్పలేని పరిస్థితి. సామాన్యులైతే తమ రాత ఇంతేనంటూ సర్దుకుపోతున్నారు. అదే కాస్త ధనవంతులు ప్రస్తుత పరిస్థితుల్లో కొన్నాళ్లపాటు మహానగరంలో ఉండకుండా సమీపంలోని తమ సొంత వ్యవసాయ క్షేత్రాలకు కుటుంబాలతో సహా తరలివెళుతున్నారు. అక్కడ ఫామ్‌హౌస్‌ల్లో ఉంటూ.. అక్కడికి ఇతరులు రాకుండా  జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

many rich people shifting to farm houses to stay away to corona
వ్యవసాయ క్షేత్రాల్లోకి ధనవంతుల మకాం

By

Published : May 20, 2021, 11:49 AM IST

రెండో దశ కరోనాతో రాజధానిలో ఎన్నో కుటుంబాలు అతలాకుతలమయ్యాయి. ఇంటిపెద్దలను కోల్పోయి రోడ్డునపడ్డాయి. సామాన్యులు, ధనవంతులు అనే తేడా లేకుండా వైరస్‌ పంజా విసురుతోంది. ఆ పరిస్థితి తమకు రావద్దంటూ.. కొందరు ధనవంతులు హైదరాబాద్ నగరానికి దూరంగా వెళ్లి కొవిడ్‌ బారి నుంచి తప్పించుకోవాలనే భావనలో ఉన్నారు. తెలంగాణలోని రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో నగరవాసులకు ఫామ్‌హౌస్‌లు ఉన్నాయి. మొన్నటి వరకు నెలకోసారి కుటుంబంతో కలిసి వెళ్లొచ్చేవారు. కరోనా నేపథ్యంలో కొద్దిరోజుల కిందటే వారంతా ఫామ్‌హౌస్‌ బాటపట్టారు. సరిపడా కూరగాయలు, సరకులు తీసుకువెళ్లి అక్కడే ఉంటున్నారు. మరికొంతమంది కూరగాయలను కూడా తమ పొలంలోనే పండించుకుని వండుకు తింటున్నారు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, సంపన్న కుటుంబాలకు చెందిన వారందరిదీ ఇప్పుడు ఇదే దారి. ఇందుకు తగ్గట్లు అక్కడే ఇతరత్రా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

  • నగరానికి చెందిన ఓ సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి.. కొవిడ్‌ భయంతో ఫామ్‌హౌస్‌కు కుటుంబంతోపాటు మకాం మార్చారు. అక్కడున్న సిబ్బందికి పీపీఈ కిట్లు ఇచ్చాడు. నెలరోజుల నుంచి అక్కడే ఉంటున్నా కూడా అతనికి కొవిడ్‌ భయం వీడలేదు. ఆందోళనతో సరిగా తినకపోవడం, నిద్రపోయే వారు కాదు. అతడి పరిస్థితి చూసిన కుటుంబీకులు మానసిక వైద్యుల వద్దకు తీసుకెళ్లి కౌన్సెలింగ్‌ ఇప్పించారు.
  • ఓ సంపన్న కుటుంబం 20 రోజుల కిందటే షాద్‌నగర్‌లోని తమ ఫామ్‌హౌస్‌కు మకాం మార్చారు. ముందుగానే అక్కడి పని వారందరికీ కొవిడ్‌ పరీక్షలు చేయించారు. నెగెటివ్‌ రిపోర్టు వచ్చిన తరువాతే వారందరినీ పనిలోకి తీసుకున్నారు. పని వారిని ప్రహరీ దాటి బయటకు వెళ్లకుండా చూస్తున్నారు. అక్కడే పండిన కూరగాయలను వినియోగిస్తున్నారు. ఇక్కడికి రావడం వల్ల మానసిక ప్రశాంతత ఉందని సంబంధిత కుటుంబీకుడు ఒకరు తెలిపారు.
  • హిమాయత్‌సాగర్‌ సమీపంలో పెద్దఎత్తున ప్రైవేటు వ్యక్తుల అతిథి గృహాలున్నాయి. వీటిని కొంతమంది అద్దెకు ఇస్తున్నారు. ఒక్కో ఇల్లు నెలకు రూ.50 వేలకుపైనే అద్దె పలుకుతోందని చెబుతున్నారు. ఇలా అద్దెకు తీసుకున్నవారు అక్కడే కుటుంబంతో ఉంటున్నారు.
  • ఫామ్‌హౌస్‌ల్లో ఉంటున్న అనేకమంది ఇతరత్రా అనారోగ్య సమస్యలు వస్తే.. నగరంలోని ఆస్పత్రులకు రాకుండా నేరుగా వీడియో కాల్‌లో సంప్రదించి వైద్య సహాయం పొందుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details