కరోనా నియంత్రణకు సంబంధించి రెండు వ్యూహాలు అనుసరిస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి చెప్పారు. కంటైన్మెంట్ క్లస్టర్ ఒకటి...ఆస్పత్రుల సదుపాయాలు రెండోదని వెల్లడించారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో 154 క్లస్టర్లు గుర్తించి కంటైన్మెంట్ చేశామని వెల్లడించారు. తాజాగా నమోదైన 32 కేసులు కూడా ఇందులోనే ఉన్నాయా లేదా అన్నది గుర్తించాలని చెప్పారు. అలాగే కరోనా నిర్ధరణ పరీక్షల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 16 వేల మందికి పైగా కరోనా వైద్య పరీక్షలు చేశామని వెల్లడించారు. ఇవాళ ఒక్కరోజే 3 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. వారం తర్వాత నుంచి రోజుకు 17 వేల టెస్టులు నిర్వహించాలన్నది తమ ప్రయత్నమని అన్నారు. లక్ష ట్రూనాట్ కిట్లకు ఆర్డర్ ఇచ్చామని చెప్పారు.
32 వేల మంది అనుమానితులు
ఈ నెల 20 నాటికి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు వెల్లడిస్తామని జవహర్ చెప్పారు. ప్రస్తుతం సర్వే చేస్తున్నామని.... దీనిలో 32 వేల మంది అనుమానితులు తేలారని ఆయన పేర్కొన్నారు. వీరికి కరోనా టెస్టులు చేస్తామని వెల్లడించారు. దీనితో పాటు పూల్ టెస్టు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. వనరులు పొదుపుగా వాడటం దీని లక్ష్యమని అన్నారు.