తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బలమున్న చోట పోటీ చేయాలని తెదేపా ప్రాథమికంగా నిర్ణయించింది. హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో అధినేత చంద్రబాబుతో ఆ రాష్ట్ర తెదేపా ముఖ్యనేతలు సమావేశమయ్యారు. హుజూర్నగర్ ఎన్నికల ఫలితాలు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె అంశాన్ని కూడా నేతలు బాబుకు వివరించారు. అధినేతను కలిసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. సీనియర్ నేత ఎర్రన్నాయుడు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
'పుర ఎన్నికలపై బాబుతో నేతల సమాలోచనలు'
పురపాలిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో బాబు సమీక్షించారు. అనంతరం వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు చంద్రబాబును కలిసి మీడియా హక్కులను కాపాడటంలో కృషి చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో మీడియా పాత్ర కీలకమని.. అలాంటి విలేకరులకు సంకెళ్లు వేయడం నిరంకుశ పాలనకు అద్దం పడుతోందని బాబు మండిపడ్డారు. మీడియా గొంతును నొక్కే జీవో 2430 రద్దుకు జర్నలిస్టు సంఘం చేస్తున్న పోరాటానికి వెన్నంటే ఉంటామని హామీ ఇచ్చారు.