రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను పార్లమెంట్ ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లి వారి జోక్యం కోరాలని తెదేపా పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. ఆర్థిక క్రమశిక్షణతో పాటు రాజ్యాంగ వ్యవస్థలపై దాడి, శాంతిభద్రతల సమస్య, దేవాలయాలపై దాడులు, వైకాపా కుంభకోణాలను పార్లమెంట్ వేదికగా ప్రస్తావించాలని అధినేత చంద్రబాబు తెలుగుదేశం ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. విభజన హామీలతో పాటు ప్రత్యేక హోదా అంశం విషయమై వైకాపా ఎంపీలను నిలదీసి వారిపై ఒత్తిడి తీసుకురానున్నట్లు నేతలు వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల్లో పార్టీ పరంగా లేవనెత్తాల్సిన అంశాలపై ఎంపీలతో చంద్రబాబు అధ్యక్షతన ఆయన నివాసంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. గల్లా జయదేవ్, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్లు ఈ భేటీలో పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు
ఎన్నికలకు ముందు 25మంది ఎంపీలనిస్తే ప్రత్యేక హోదా సాధిస్తానని జగన్ చెప్పారు. ప్రస్తుతం 22 మంది ఎంపీలున్నా ప్రత్యేక హోదాపై ప్రస్తావన లేదు. వైకాపా ఎంపీలు దీనిపై పార్లమెంట్లో మాట్లాడేలా ఒత్తిడి తీసుకొస్తాం. విభజన చట్టంలో పెండింగ్లో ఉన్న 19అంశాలు పార్లమెంట్ వేదికగా ప్రస్తావిస్తాం. రాజధాని తరలింపు కుట్రను దిల్లీ వేదికగా ఆవిష్కరించటంతో పాటు ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ తప్పి వ్యవహరిస్తున్న విధానాలను పార్లమెంట్ ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం. నరేగా నిధుల దుర్వినియోగం, పోలీసు వ్యవస్థ తీరును పార్లమెంట్లో లేవనెత్తుతాం- గల్లా జయదేవ్, తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత