ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వరుణుడి ప్రతాపం... కృష్ణా జిల్లా అతలాకుతలం - గుంటూరు జిల్లాలో భారీ వర్షం వార్తలు

వరుణుడి ప్రతాపానికి కృష్ణా, గుంటూరు జిల్లాలు వణికిపోతున్నాయి. కృష్ణమ్మకు వరుసగా వస్తున్న వరదలతో పరివాహక ప్రాంత ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంట నీట మునిగి... ఆవేదనలో ఉన్న రైతుల్ని.... మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వాగులు వంకలు ఉగ్రరూపం దాల్చగా... భారీ వరదలతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

water levels rising in krishna
water levels rising in krishna

By

Published : Oct 15, 2020, 2:53 AM IST

Updated : Oct 15, 2020, 5:26 AM IST

వరుణుడి ప్రతాపం... కృష్ణా జిల్లా అతలాకుతలం

కృష్ణా నదిపై పులిచింతల, ప్రకాశం బ్యారేజీలు నిండుకుండలా పరవళ్లు తొక్కుతున్నాయి. పైనుంచి వస్తున్న వరదనీటిని ఎప్పటికప్పుడు అధికారులు దిగువకు వదులుతున్నారు. 7 లక్షల క్యూసెక్కుల మేర నీటిని దిగువకు పంపిస్తుండటంతో కృష్ణా పరివాహక ప్రాంత గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. తాడేపల్లి, దుగ్గిరాల, కొల్లూరు, కొల్లిపొర, భట్టిప్రోలు, రేపల్లె మండలాల పరిధిలో కృష్ణా నది ప్రవాహం సాగుతోంది. ఈ మండలాల పరిధిలో 20కి పైగా గ్రామాల్లో ప్రస్తుతం వరద పరిస్థితి తీవ్రంగా ఉంది.

వరదనీటితో భూమి ఎప్పటికప్పుడు కోతకు గురై ప్రవాహం పెరిగేకొద్దీ పొలాల్లోకి నీరు చేరుతోంది. పెసర, మినుము, మిరప, పసుపు, కంద పంటలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో పసుపుమొక్కలు వేర్లతో సహా పైకి తేలాయి. దీంతో పసుపు రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇవాళ, రేపు వరద మరింతగా పెరిగే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ అధికారులు ప్రకటించటంతో... రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

పంట నష్టం ఎంతంటే...?

కేవలం కృష్ణా జిల్లాల్లోనే వరదల కారణంగా ఇప్పటివరకూ 12వేల 466 హెక్టార్ల పంట దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. వీటిలో 5వేల 243 హెక్టార్లలో వరి, 5 వేల 547 హెక్టార్లలో పత్తి, 909 హెక్టార్లలో మొక్కజొన్న పంట దెబ్బతిన్నట్లు జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ ప్రభుత్వానికి నివేదిక అందించారు. అంతేకాకుండా సుమారు 14వందల10 హెక్టార్ల విస్తీర్ణంలో ఉద్యాన పంటలైన మిర్చి, కూరగాయలు, పసుపు పంటలు ముంపునకు గురైనట్లు పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలుచోట్ల కల్వర్టులు అద్వాన్నస్థితికి చేరుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 407 కిలోమీటర్ల మేర రహదారులు మరమ్మతుకు గురయ్యాయి. 21 చోట్ల కల్వర్టులు శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటి పునరుద్ధరణ కోసం 23.57 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

రక్షణ గోడ పనులకు ఆదేశం..

కొన్నిచోట్ల స్లూయిజ్ లకు రక్షణ గోడలు కట్టకపోవటం వల్ల వరదనీరు పొలాల్లోకి చేరుతోంది. ఈ స్లూయిజ్ లు ఉన్న ప్రాంతాల్లో పొలాలు ఉన్నంత వరకూ అడ్డుగోడలు కట్టాల్సిన అవసరం ఉందని రైతులు అంటున్నారు. అలా చేయకపోవటం వల్ల వందలాది ఎకరాలు మునిగిపోతున్నట్లు చెబుతున్నారు. కృష్ణానది ఒడ్డున 152.9 కోట్ల రూపాయలతో మంజూరైన రక్షణ గోడ పనులను వరద ప్రవాహం తగ్గిన వెంటనే చేపట్టాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

కరకట్టపై పరిస్థితి...

కృష్ణానది వరద ఉద్ధృతితో నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. నదీ ప్రవాహం నుంచి జనావాసాల్ని రక్షించే కరకట్టను నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా వర్షం నీరు, వరదల కారణంగా మట్టి కొట్టకుపోయినా, గండ్లు పడినా వాటిని వెంటనే మరమ్మత్తులు చేస్తున్నారు. నీటి పారదల శాఖ అధికారులు కరకట్ట వెంట పర్యటిస్తూ పరిస్థితిని గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాలువలపైన ఆక్రమణలను యుద్ధ ప్రాతిపదికన గుర్తించి... అక్రమ కట్టడాలను తొలగించాలని అధికారులను గుంటూరు నగర కమిషనర్‌ చల్లా అనురాధ ఆదేశించారు.

వ్యవసాయశాఖ కమిషనర్ పర్యటన

విజయవాడ గుణదల బుడమేరు ముంపు ప్రాంతాలను విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పర్యటించారు. ముంపునకు గురైన పంటపొలాలను రైతులతో కలిసి పరిశీలించారు. కృష్ణాజిల్లా నందిగామలోని డీవీఆర్‌ కాలనీలో తెలుగుదేశం నాయకులతో కలిసి వరద ముంపునకు గురైన ప్రాంతాలను మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరిశీలించారు. వరదలతో చాలా మంది బాధితులు తమ నిత్యావసరాలను కోల్పోయారని ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బాపులపాడు మండలం బండారుగూడెంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ పర్యటించారు. గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టం అంచనా వేస్తారని... పంట నష్టపోయిన రైతుల వివరాలు రైతు భరోసా కేంద్రాల్లో పెడతారని తెలిపారు. ప్రభుత్వ పెద్దలు చూసి పోతున్నారే తప్పా... తమకి పరిహారం అందట్లేదని బాధితులు వాపోతున్నారు.

వరద ఉద్ధృతి కొల్లూరు మండలంపై ఎక్కువ ప్రభావం చూపనుంది. కైకలూరు ఏలూరు ప్రధాన రహదారిపై నుంచి రెండు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. కదిరి గుడి వద్ద కొల్లేరు ఉద్ధృతంగా ప్రవహిస్తూ మునుపెన్నడూ లేని విధంగా ఉగ్రరూపం దాల్చుతోంది. దీంతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి:

మంత్రి వెల్లంపల్లికి కరోనాతో అస్వస్థత.. హైదరాబాద్​కు తరలింపు

Last Updated : Oct 15, 2020, 5:26 AM IST

ABOUT THE AUTHOR

...view details