వరద నీటితో గోదావరి, ప్రాణహిత నదులు కళకళలాడుతున్నాయి. శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. తెలంగాణలోని నారాయణపూర్ నుంచి విడుదల చేసే నీటితోపాటు దిగువన ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అక్కడి జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాలకు వస్తున్న ప్రవాహం నిలకడగా ఉంది.
శుక్రవారం సాయంత్రం 6 గంటలకు జూరాల జలాశయంలోకి 95 వేల క్యూసెక్కుల వరద చేరుకుంది. అక్కడి నుంచి సుమారు 74 వేల క్యూసెక్కులకు పైగా విడుదల చేస్తుండగా, దిగువన కురిసే వర్షాలతో కలిసి శ్రీశైలంలోకి లక్ష క్యూసెక్కులకు పైగా చేరుతోంది. ఎగువ, దిగువ జూరాల జలవిద్యుత్తు కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతోంది. మొత్తం 11 యూనిట్ల నుంచి 429 మెగావాట్ల ఉత్పత్తి వస్తోంది.
మరోవైపు.. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా గోదావరి బేసిన్‌లోని శ్రీరామసాగర్‌లోకి కూడా 11 వేల క్యూసెక్కులకు పైగా ప్రవాహం ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు వరద నీటితో కళకళలాడుతున్నాయి. దీంతో స్థానిక పుష్కర ఘాట్ వద్ద 7.78 మీటర్ల మేర ప్రవాహం నమోదైంది.