కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని కేంద్రం నోటిఫై చేసిన నేపథ్యంలో గత నాలుగైదేళ్లుగా సమావేశాల్లో, పరస్పర లేఖల ద్వారా వాదప్రతివాదనలు జరుగుతున్న అంశాలను ఇక బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తేల్చాల్సిందేనని తెలంగాణ నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. పోలవరం నిర్మాణం ద్వారా గోదావరిలోకి మళ్లించే నీటిలో వాటా, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగించే నీటిలో 20 శాతాన్నే లెక్కల్లోకి తీసుకోవడం, వరద సమయంలో మళ్లించే నీటిని పరిగణనలోకి తీసుకోకపోవడం, విద్యుత్తు కోసం నీటి వినియోగం తదితర అంశాలు ఇందులో ఉన్నాయి.
వివరాలు ఇవీ..
- పోలవరం నిర్మాణం ద్వారా గోదావరి నుంచి కృష్ణాలోకి మళ్లించే 80 టీఎంసీల నీటి పంపిణీపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల మధ్య ఒప్పందం జరిగింది. పోలవరానికి కేంద్ర జల సంఘం అనుమతి వచ్చినప్పటి నుంచి ఈ నీటిని వినియోగించుకొనేలా నిర్ణయం జరిగింది. 1978 ఆగస్టు 4న ముఖ్యమంత్రుల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం 35 టీఎంసీలు కర్ణాటక, మహారాష్ట్రలకు, 45 టీఎంసీలు నాగార్జునసాగర్ ఎగువన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వినియోగించుకోవాలి. సింగూరు, జూరాల ప్రాజెక్టుల ముంపు ప్రాంతంలో భూసేకరణ, స్ట్రక్చర్లకు పరిహారం తదితర అంశాల్లో కర్ణాటక సహకరించిన నేపథ్యంలో ఈ ఒప్పందం జరిగింది. 35 టీఎంసీల్లో మహారాష్ట్ర 14, కర్ణాటక 21 టీఎంసీలు వాడుకొనేలా ఒప్పందం చేసుకొన్నాయి. అయితే, పునర్విభజన తర్వాత.. నాగార్జునసాగర్ ఎగువన వాడుకోవాల్సిన 45 టీఎంసీల వ్యవహారం ఇప్పటి వరకు తేలలేదు. సాగర్ ఎగువన కృష్ణాబేసిన్‌లో ఉన్నది తెలంగాణ ప్రాజెక్టులే కాబట్టి ఈ మొత్తం నీటిని తమకు కేటాయించాలని తెలంగాణ కోరుతోంది. దీనికి ఆంధ్రప్రదేశ్ అంగీకరించలేదు. కేంద్రం నిపుణుల కమిటీని నియమించినా.. ఫలితం లేకుండా పోయింది. దీనిపై కేంద్రం, బోర్డు ఏమీ తేల్చలేదు. ప్రస్తుతం కృష్ణా బోర్డు పరిధి నోటిఫికేషన్‌లో కూడా ఈ అంశాన్ని చేర్చారు. తాత్కాలికంగా ఇద్దరి మధ్య ఏదైనా ఒప్పందం జరుగుతుందా? లేదా? అన్నది చెప్పలేని పరిస్థితి. అయితే, ఎవరికి ఎంత నీరన్నది చివరకు ట్రైబ్యునలే తేల్చాల్సి ఉంటుంది.
- హైదరాబాద్ తాగునీటికి 16.5 టీఎంసీల వినియోగం ఉంది. ఇలా వాడిన నీటిలో 80 శాతం తిరిగి నదిలోకి చేరుతుంది కాబట్టి 20 శాతం నీటినే లెక్కలోకి తీసుకోవాలని, బచావత్ ట్రైబ్యునల్ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పిందని తెలంగాణ.. బోర్డు దృష్టికి తెచ్చింది. పలుసార్లు చర్చించినా ఫలితం లేకపోవడంతో ఈ అంశం కూడా ఇక ట్రైబ్యునల్‌కు వెళ్లే అవకాశం ఉంది.