Student In Elon Musk School: తెలంగాణ వరంగల్‌లోని గోపాలపూర్‌లో ఉంటున్న విజయ్‌పాల్, సృజన దంపతుల కుమారుడు అనిక్‌పాల్. చిన్నతనంలోనే తనదైన ప్రతిభ చాటాడు. నిట్ సమీపంలోని ప్రభుత్వ ఆర్సీ పాఠక్ పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్న అనిక్.. ఆన్‌లైన్ వీడియోగేమ్స్ ఆడి వదిలేయకుండా... ఎలా రూపొందిస్తారనే అన్వేషణ మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే కోడింగ్, పైథాన్ లాంగ్వేజ్‌లు నేర్చుకున్నాడు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేశాడు. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ స్థాపించిన సింథసిస్ పాఠశాలలో ప్రవేశం సాధించాడు.
Student In Elon Musk School: చిన్నవయసులోనే అద్భుత ప్రతిభ.. ఎలాన్ మస్క్ పాఠశాలలో ప్రవేశం - ఏపీ తాజా వార్తలు
Student In Elon Musk School: సాధారణంగా పిల్లలు వీడియోగేమ్స్ ఆడుతుంటారు. కానీ... అవి ఎలా రూపొందిస్తారని ఓ ఆరో తరగతి విద్యార్థి ఆలోచించాడు. తల్లిదండ్రుల సహకారం, ప్రోత్సాహంతో వాటి గురించి తెలుసుకున్నాడు. ఆ ఆసక్తే తెలంగాణలోని వరంగల్‌కు చెందిన అనిక్‌పాల్ అరుదైన ఘనత సాధించేలా చేశాయి. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ అమెరికాలో స్థాపించిన సింథసిస్ పాఠశాలలో ప్రవేశం సాధించాడు.
Warangal student: అనిక్‌పాల్ తండ్రి విజయ్‌పాల్ ఉపాధ్యాయుడు కావటంతో చిన్నారిని ప్రోత్సహించారు. ఇప్పుడున్న విద్యా ప్రణాళికలు, బోధన పద్ధతులు ఆశించిన మేరకు లేకపోవటంతో... మరో దారిని ఎంచుకున్నారు. ఎలాన్ మస్క్ స్థాపించిన సింథసిస్ పాఠశాల గురించి తెలుసుకున్న విజయ్.. కుమారుడి ప్రవేశానికి అవసరమైన నైపుణ్యాలు నేర్పించారు.
Anik pal got seat in elon musk school: ప్రవేశ పరీక్షలో మూడు స్థాయులుంటాయి. సింథసిస్ పాఠశాల యాజమాన్యం వీడియోలు, గేమ్స్ రూపంలో ప్రశ్నలను ఇచ్చి వాటిని విద్యార్థులు ఎలా చేధిస్తున్నారనే విషయాన్ని పరిశీలిస్తారు. అనిక్ పాల్ మొదటి రెండు దశల్లో ప్రశ్నలకు విజయవంతంగా సమాధానాలిచ్చాడు. తర్వాత ఓ వివరణాత్మక సమస్యకు వీడియో రూపొందించి పంపించాడు. చివరగా ఆన్‌లైన్‌లో ముఖాముఖి ఇంటర్వ్యూ నిర్వహించిన యాజమాన్యం... అనిక్‌పాల్‌కు ఈనెల 12న ఆరో తరగతిలో ప్రవేశం కల్పించింది. ప్రస్తుతం ఆన్‌లైన్ తరగతులు జరుగుతున్నాయి. కరోనా నిబంధనలు పూర్తిగా ఎత్తివేసిన తర్వాత అమెరికాకు పంపిస్తామని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఐఐటీ మద్రాస్ నిర్వహించిన వరల్డ్ బుక్ ఆఫ్ గిన్నిస్ కార్యక్రమంలో అతి తక్కువ సమయంలోనే ప్రాజెక్టు సమర్పించి అనిక్ పాల్ సత్తా చాటాడు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.