వరంగల్.. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత పెద్దనగరం. ఇప్పుడు ఈ మహానగరాన్నీ వరద కష్టాలు వీడట్లేదు. గత ఏడాది ఆగస్టులో వారం రోజుల పాటు కురిసిన వర్షానికి నగరం పూర్తిగా జలదిగ్భందనమైంది. దీంతో అప్రమత్తమైన అధికారులు నాలాల చుట్టూ ఆక్రమణలు తొలగించారు. ఇక వరంగల్‌కు వరద ముంపు లేదని ధీమాగా ఉన్నారు. రుతుపవనాల ఆరంభంలోనే జోరుగా కురిసిన వర్షాలతో వరంగల్‌లో ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయాయి. ఎండాకాలంలోనే నాలాల్లో పూడిక తీపించాల్సిన బల్దియా అధికారులు.. కర్తవ్యాన్ని మరిచిపోవడంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి.
పరుగులు పెట్టి.. పూర్తి కాకుండానే వదిలేసి..
జిల్లా కలెక్టర్, నగర మేయర్ ఆదేశాలతో ఉరుకులు పరుగులు పెట్టిన బల్దియా అధికారులు నాలాల్లో పూడిక తీతలు తీసే పని చేపట్టారు. అదీ అసంపూర్తిగానే చేశారు. ఆదివారం మరోసారి వరుణుడి చూపిన ప్రతాపానికి వరంగల్ తడిసి ముద్దైంది. ఏకధాటిగా మూడు గంటల పాటు వర్షం దంచికొట్టింది. దీంతో నగరంలోని రహదారులు ఏరులను తలపించాయి. ఇళ్లల్లోకి దుకాణాల్లోకి నీళ్లు వచ్చి చేరడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు.
ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి. ఎవరు రావట్లేదు చూడటానికి, వచ్చినా.. చూస్తారు, పోతారు, ఖతం. ఏం పట్టించుకోవడం లేదు. ఏం చేస్తలేరు. ఇంట్లో వాసనైతే భరించలేకపోతున్నాం. మోరీలో నీళ్లతో ఇంట్లోని రూమ్‌లన్నీ నిండినయ్. ఒక్కరోజు వర్షానికే మా పరిస్థితి ఇట్లున్నది. - స్థానికురాలు
మోరీలు తీయ్యలేదు. పై నుంచి వరదంతా వచ్చేసింది. పోయినసారి వర్షానికి ఇళ్లలోని చాలా వస్తువులు కరాబ్ అయినయ్. మోరీలు నిండితే మున్సిపాలిటి వాళ్లు కూడా మోరీలు ఎక్కువగా తీస్తలేరు. చెత్త అంతా అక్కడే ఉండిపోవడంతో మోరీలు నిండి నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయ్. - స్థానికురాలు
మోకాళ్ల దాకా నీళ్లు, గడ్డి, పాములు తీరుగుతున్నాయి. తెళ్లు, పురుగులు ఉంటున్నాయ్. ఎవరు పట్టించుకునేటోళ్లు లేరు, చూసేటోళ్లు లేరు. మేం పనికి పోతాం. అర్ధరాత్రి వస్తాం. లైట్లు లేవు ఏమీ లేవు. అంతా ఆగం ఉన్నది కథ ఇక్కడ. నది ఎట్లా పారతదో.. గట్లా పారినయ్ నీళ్లన్ని - స్థానికురాలు.