VRA Protest: వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏల వేతనాలను రూ.21వేలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
కర్నూలు: వీఆర్ఏలకు కనీసవేతనం 21 వేలు ఇవ్వాలని కర్నూలులోని శ్రీకృష్ణ దేవరాయల కూడలిలో రిలే నిరహార దీక్ష చేపట్టారు. అర్హులైన వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించి చనిపోయిన వీఆర్ఏల కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని కోరారు.
నెల్లూరు: రెవెన్యూ గ్రామ సహాయకుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు ర్యాలీగా చేరుకొని నిరసన తెలిపారు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించకపోతే ఛలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ ర్యాలీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల సంఘం నాయకుడు చొప్పర రవీంధ్రబాబు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ పాల్గొన్నారు.
కడప: ప్రభుత్వం వీఆర్ఏల సమస్యలు పరిష్కరించకుంటే ఛలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడతామని ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యేసు రత్నం హెచ్చరించారు. వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కడప కలెక్టరేట్ ఎదుట జిల్లావ్యాప్తంగా వీఆర్ఏలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు.
ప్రకాశం: ప్రభుత్వం వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రకాశం జిల్లా కందుకూరు మండలంలో రెవెన్యూ గ్రామ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వీఆర్ఏల ఆందోళనలు వీఆర్ఏల డిమాండ్లు:
- వీఆర్ఏల వేతనాలు 21వేల రూపాయలకు పెంచాలి.
- డీఏ రికవరీ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలి.
- నామినీలుగా పనిచేస్తున్న వారిని ఉద్యోగులుగా నియమించాలి.
- అర్హులందరికీ ప్రమోషన్లు ఇవ్వాలి.
- ప్రభుత్వ పథకాలన్నీ వీఆర్ఏలకు వర్తింపచేయాలి.
- 65 సంవత్సరాలు దాటి మరణించిన వారందరికీ కంపాసినేట్ కింద ఉద్యోగం ఇవ్వాలి.
- వీఆర్ఏల సమస్యలపై సీసీఐల్ అధికారులు రాష్ట్ర కమిటీతో చర్చలు జరపాలి.
ఇదీ చదవండి:Amaravathi: అమరావతి VS మూడు రాజధానులు.. ఎప్పుడేం జరిగిందంటే ?