ప్రజాస్వామ్యం పురోగతి వైపు పయనించాలంటే... అన్ని వర్గాల ప్రజలు ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనాలి. తమతమ ప్రతినిధులను ఎన్నుకోవాలి. అప్పుడే ప్రజాసమస్యలకు పరిష్కారాలు లభించి సమాజం అభివృద్ధి చెందుతుంది. ప్రజాస్వామ్యంలో ఓటింగ్ శాతమే పౌరుల భాగస్వామ్యానికి కొలమానం. ప్రజాస్వామ్య దేశాల్లో ఓటింగ్ శాతం తగ్గడం 1945 నుంచి ప్రారంభమై... 1980 మధ్యకాలానికి బాగా దిగజారింది. భారత్ విషయానికొస్తే పార్లమెంటు ఎన్నికలతో పోలిస్తే గ్రామీణ, స్థానిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం అధికంగా ఉంటుందని.. పట్టణ ప్రజలకంటే పల్లె ప్రజలు చురుగ్గా పాల్గొంటారని జాతీయ ఎన్నికల అధ్యయన సమాచారం తెలియజేస్తోంది.
వ్యక్తిగత కారణాలే ప్రధానం..
పట్టణాలు, మహానగరాలతో పోలిస్తే... పల్లెల్లో ఓటింగ్ శాతం ఎక్కువే. అయినా క్రమంగా ఓటింగ్ శాతం తగ్గడం ఆందోళన కలిగించే విషయాలు. వ్యవస్థ, వ్యక్తిగత అంశాలు ఈ పరిస్థితికి కారణమవుతున్నాయి. ఓటర్ల జాబితా సవరణను సకాలంలో చేపట్టకపోవడం, జాబితాలో అవకతవకలు, రిజర్వేషన్లు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు మొదలైనవి సంస్థాగత కారణాలు. ఓటర్ల నిరాసక్తత, బాధ్యతారాహిత్యం, ఓటింగ్‌పై అపోహలు వంటివి వ్యక్తిగత కారణాలు. ఓటింగ్ శాతం తక్కువగా ఉండటానికి సంస్థాగత కారణాల కంటే, వ్యక్తిగత కారణాలే ప్రధానం. ఈ పరిస్థితిని చక్కదిద్దినప్పుడే పల్లెల్లో ప్రజాస్వామ్యం వికసిస్తుంది.
అప్పుడే ప్రజాస్వామ్యం విరాజిల్లుతుంది..