ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Huzurabad Bypoll 2021: ఇలా తయారయ్యారేంటి... డబ్బులు ఇవ్వకపోతే దాడి చేస్తారా? - Huzurabad by poll news

నిన్నమొన్నటి వరకు ఓటుకు డబ్బులివ్వడం లేదని ధర్నాలు చేశారు. నడిరోడ్డుపైనే నిలదీశారు. నోటిస్తినే ఓటేస్తామని బహిరంగంగానే చెప్పారు. ఇప్పుడు ఓటర్లు కాస్త రూటు మార్చారు. ఇంకా ఎన్నికకు ఒక్క రోజే ఉంది... డబ్బులివ్వడం లేదని ఏకంగా ఓ కౌన్సిలర్​​ ఇంటిపై దాడి చేశారు. ఇలా తయారయ్యారేంటి... డబ్బులు ఇవ్వకపోతే దాడి చేస్తారా? అని కౌన్సిలర్​ ​ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Huzurabad
Huzurabad

By

Published : Oct 29, 2021, 12:28 PM IST

ఇలా తయారయ్యారేంటి... డబ్బులు ఇవ్వకపోతే దాడి చేస్తారా?

తెలంగాణ రాష్ట్రంలో హుజూరాబాద్​ ఉపఎన్నికలు రసవత్తరంగా మారాయి. రాష్ట్రమంతా ఎంతో ఉత్కంఠంగా ఈ​ ఎన్నిక వైపే చూస్తుండగా.. ఆయా పార్టీలు తమ గెలుపు కోసం అన్ని రకాల అస్త్రాలు ప్రయోగిస్తున్నాయి. ప్రచారం గడువు ముగిసింది.. రేపే ఎన్నికలు.. మరోవైపు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు లక్ష్మీదేవిని రంగంలోకి దింపారు. ఇన్ని రోజులు పార్టీలు నిర్వహించే.. సమావేశాల కోసం జనాన్ని పోగేసేందుకు రోజువారి కూలీల లెక్కన డబ్బు పంచిన చోటా నాయకులు.. ఇప్పుడు ఓటుకింతా అని ఏకంగా కవర్లల్లో డబ్బులు పెట్టి పంచేస్తున్నారు. డబ్బులు పంచుతున్న వీడియోలు సోషల్​ మీడియాలో తెగ వైరల్​ అవుతున్నాయి కూడా.

డబ్బు కోసం ఇంటిపై దాడి

అయితే కొంతమందికి ఆ డబ్బులు అందక... ఆందోళనలు చేస్తున్నారు. హుజూరాబాద్​ పట్టణంలోని గాంధీనగర్​లో ఒక కౌన్సిలర్​ ఇంటిని ముట్టడించారు. వార్డు సభ్యులు... ఒక ఓటుకు 6000 చొప్పున కొంతమందికి మాత్రమే ఇచ్చారని వారు కౌన్సిలర్​ ఇంటి వద్ద ఆందోళన చేశారు. ఈ క్రమంలో వార్డు ప్రజలకు నచ్చ చెప్పినా.. వినలేదని 70 లక్షలు ఇంట్లో పెట్టుకొని ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారని కౌన్సిలర్​ భార్య ఈటీవీభారత్​కు తెలియజేశారు. అంతే కాకుండా తనతో పాటు.. కుమారునిపై దాడి చేసినట్లు పేర్కొన్నారు.

కొంతమందికి ఓటుకు 6000 ఇచ్చాం. కొంతమందికి రాలేదు. వస్తాయి.. సారు అందరికి ఇస్తారు అని చెప్తూనే ఉన్నాం... అంతలోనే కొంత మంది మా ఇంటికి వచ్చి.. మాపై, నా కుమారుడిపై దాడి చేశారు. రాళ్లు తీసుకుని విసిరారు. 70 లక్షలు ఇంట్లో పెట్టుకుని ఇవ్వట్లేదని... దాడికి దిగారు.

- ఓ వార్డు కౌన్సిలర్​ భార్య

నిలదీసిన మహిళలు

హుజూరాబాద్‌లోని కొత్తపల్లిలో తమకు డబ్బు అందలేదని గ్రామంలోని ఓ ప్రాంతపు మహిళా ఓటర్లంతా కలిసి ఏకంగా ఆందోళనకు దిగారు. ఆ ప్రాంతానికి చెందిన మహిళలు, వృద్ధులంతా కలిసి ఓ వ్యక్తిని చుట్టుముట్టేశారు. "ఫలానా ప్రాంతంలో డబ్బు పంచుతున్నావు కదా.. మరి మాకెందుకు ఇవ్వడం లేదు" అని నడిరోడ్డు మీద నిలదీశారు. కొంత మందికి ఇచ్చి తమకెందుకు ఇవ్వలేదని అందరి ముందే కడిగేశారు. ఈ పరిణామం ఊహించని ఆ వ్యక్తికి.. ఏం చెప్పాలో తెలియక సతమతమైపోయాడు. తాను ఎవరికీ డబ్బు ఇవ్వలేదని వాళ్లకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించి.. అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. డబ్బు ఇవ్వడం లేదని ధర్నా చేద్దామని.. కొంత మంది మహిళలు నిర్ణయించుకోగా.. పోలీసులు వచ్చి పట్టుకెళ్తారేమోనని మరికొందరు వెనుకంజ వేశారు.

పైసలిస్తే ఓట్లు లేకపోతే లేదు..

"ఒక్కొక్క ఓటుకు కవరులో ఆరు వేల రూపాయల చొప్పున ఇస్తున్నారు. మా ఇళ్లలో కూడా ఓట్లు ఉన్నాయి. మరి మాకెందుకు ఇవ్వరు. మా ఇంట్లో ఐదు ఓట్లున్నాయి. ఇస్తే అందరికి ఇయ్యాలే. ఇయ్యకపోతే మొత్తానికే ఇయ్యద్దు. కొందరికి ఇచ్చి.. మాకెందుకు ఇస్తలేరు. పల్లెల్లో ఓటుకు 6 వేలు ఇస్తున్నారట.. సిటీల్లో 10 వేలు పంచుతున్నారట. మాకైతే.. ఒక్క రూపాయి కూడా ఇప్పటి దాకా అందలే. మాకు డబ్బు ఇస్తేనే ఓట్లు వేస్తాం. లేకపోతే .. అసలు ఎవ్వరికీ ఓట్లు వేయం" -మహిళా ఓటర్లు

పలుచోట్ల ఉదయం ఆరు గంటల నుంచి 7 గంటల ప్రాంతంలో డబ్బు కవర్ల పంపిణీ జరిగిందని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరగింది. ఈ వార్తలతో పలుచోట్ల ఆందోళనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఈ ఓటర్ల ఆవేదనతో కూడిన ఆందోళన వీడియో వైరల్​గా మారి.. ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఇదీ చూడండి:BADVEL BY ELECTIONS: బద్వేలు బరిపై వైకాపా గురి.. 30న పోలింగ్‌, 2న కౌంటింగ్‌..

ABOUT THE AUTHOR

...view details