జడ్జి రామకృష్ణ హైకోర్టులో వేసిన అనుబంధ పిటీషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టుకు సమర్పించిన పెన్ డ్రైవ్‌లో సంభాషణపై నిజనిర్ధరణ చేయాలని హైకోర్టు నిర్ణయించింది. విచారణ అధికారిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌వీ రవీంద్రన్‌ను నియమించింది. దర్యాప్తులో భాగంగా విచారణ అధికారికి అవరమైతే సీబీఐ, కేంద్ర విజిలెన్స్ అధికారులు సహకరించాలని తెలిపింది. సాధ్యమైనంత త్వరగా నివేదికను సమర్పించాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ధర్మాసనం నాలుగు వారాలకు వాయిదా వేసింది.
హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తికి.. ఒక జడ్జికి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలను వింటే ప్రాథమికంగా కుట్ర కోణం ఉన్నట్లు తెలుస్తోందని ఏపీ హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సంభాషణల్లో వాస్తవాలను తేల్చే బాధ్యతను సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌వీ రవీంద్రన్‌కు అప్పగిస్తూ గురువారం కీలక ఆదేశాలు జారీచేసింది. విచారణ జరిపి, సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని జస్టిస్ రవీంద్రన్‌ను కోరింది. ఆయనకు విచారణలో పూర్తి సహకారం అందించాల్సిందిగా సీబీఐ డైరెక్టర్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్లను ఆదేశించింది. ప్రస్తుతం కేసుపై దర్యాప్తునకు ఆదేశించడం లేదని, కేవలం పెన్‌డ్రైవ్‌లో ఉన్న సంభాషణల్లో వాస్తవాలను తేల్చేందుకు సుప్రీం విశ్రాంత న్యాయమూర్తితో విచారణకు ఆదేశిస్తున్నామని స్పష్టం చేసింది. ఇందుకు జస్టిస్ రవీంద్రన్ అంగీకారం తీసుకోవాల్సిందిగా హైకోర్టు రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ కె.లలితలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
హైకోర్టు సీజే, సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై కుట్రకు పథకం వేసినట్లు పెన్‌డ్రైవ్‌లోని సంభాషణల ద్వారా వెల్లడవుతోంది. హైకోర్టు చరిత్రలో ఈ ఘటన దురదృష్టకరం. తనతో ఒక వ్యక్తి జరిపిన ఫోన్ సంభాషణల వివరాలను జడ్జి రామకృష్ణ హైకోర్టులో సమర్పించారు. సంభాషణలో ఉన్న గొంతు ఆ వ్యక్తిదేనా కాదా అనే విషయంలో మేం ఓ నిర్ణయానికి రావడం కష్టం. సంభాషణ ప్రకారం హైకోర్టు సీజేకు వ్యతిరేకంగా రాష్ట్రపతికి పిటిషన్ పంపి తీవ్రమైన కుట్ర పన్నినట్లు వెల్లడవుతోంది. సీజేఐకి వ్యతిరేకంగా సాక్ష్యాలను పంపాలని జడ్జి రామకృష్ణను కోరారు. అలాంటి ఆరోపణలు న్యాయవ్యవస్థ విశ్వనీయతపై ప్రభావం చూపుతాయి. దురుద్దేశంతో హైకోర్టు సీజేపై కుట్ర పన్నినట్లు అందులో ఆరోపణలున్నాయి. ఆ ఇద్దరి మధ్య సంభాషణను ప్రాథమికంగా చూస్తే కుట్ర కోణం ఉన్నట్లు వెల్లడవుతోంది. న్యాయవ్యవస్థకు విశ్వాసం వెన్నెముక లాంటింది. నమ్మకం ఒక్కటే వ్యవస్థను బతికిస్తుంది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తిపై వినియోగించిన భాషను తీవ్రంగా పరిగణించాలి. ఆ సంభాషణ ప్రజల్లోకి వెళ్తే న్యాయవ్యవస్థ విశ్వాసంపై ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో విశ్వాసం నిలపాల్సిన విధి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంపై ఉంది. న్యాయమూర్తులపై ఆరోపణలు, కుట్రలను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. వాస్తవాలను నిగ్గుతేల్చాలి. లేకపోతే ఏదో ఒక రోజు వ్యవస్థ కుప్పకూలుతుంది. సంభాషణల్లో వాస్తవికతను కనుగొనేందుకు విచారణ ఒక్కటే మార్గం. న్యాయవిచారణలో నిజం అనేది వేగుచుక్క అని సుప్రీంకోర్టు చెప్పింది. వాస్తవం న్యాయానికి పునాది అని తెలిపింది. వ్యక్తుల మధ్య సంభాషణలపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయకుండా ప్రస్తుత కేసులో పెన్‌డ్రైవ్‌లోని సంభాషణల్లో నిజానిజాలు తేల్చేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌వీ రవీంద్రన్ ద్వారా విచారణకు ఆదేశిస్తున్నాం’ అని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
కేసు ఇదీ..
హైకోర్టు ప్రాంగణాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించాలని, ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ మృతిపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య సభ్యులు లక్ష్మీనరసయ్య హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో తనను ప్రతివాదిగా చేర్చుకొని వాదనలు వినిపించేందుకు అనుమతివ్వాలని జడ్జి రామకృష్ణ అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. జస్టిస్ ఈశ్వరయ్యకు, తనకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. గురువారం దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులపై కుట్ర పన్నుతున్నట్లు సంభాషణలో ఉందని గుర్తుచేసింది. ఇదే వాస్తవమని తేలితే ఈ వ్యాజ్యంలో తదుపరి విచారణ సాధ్యపడుతుందని తెలిపింది. తాము దాఖలు చేసిన పిల్‌లో విచారణకు ఆదేశాలు అవసరం లేదని విద్యార్థి సమాఖ్య తరఫు న్యాయవాది అభ్యంతరం తెలపగా.. హైకోర్టు, న్యాయమూర్తుల ప్రతిష్ఠకు కళంకం తెచ్చే ప్రయత్నం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో సుమోటోగా ఆదేశాలు జారీచేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్.శ్రీరామ్ స్పందిస్తూ.. ఫోన్ సంభాషణలోని అవతలి వ్యక్తి వాదనలు కూడా వింటే బాగుంటుందన్నారు. సంభాషణల వాస్తవమనే నిరూపితమైతే ఆ విషయాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం వ్యాఖ్యానించింది.