పశుపక్ష్యాదులు, పెంపుడు జంతువులూ విషవాయు ధాటికి ప్రాణాలు కోల్పోగా- మరణాన్ని శ్వాసిస్తూ నడివీధుల్లో ఒరిగిపోయిన పిన్నలూ పెద్దలు అనుభవించిన నరకయాతన చెప్పనలవికాదు. నిరంతరం నిర్వహణ అవసరమైన ప్లాంటుకు లాక్‌డౌన్ పెనుశాపమైందన్న వాదనతో ఎల్‌జీ పాలిమర్స్ తన బాధ్యతను దులపరించేసుకోలేదు. వందేళ్లు పైబడిన చక్కెర కర్మాగారం పరిశుభ్రత కొరవడిన కారణంగా అగ్ని ప్రమాదానికి లోనై 14మంది సిబ్బందిని బలిగొందంటూ- బహుముఖంగా భద్రతాంశాలపై దృష్టి సారించాలని మొన్న జనవరిలోనే ఎల్‌జీ పాలిమర్స్ సంస్థాగత వార్తాలేఖ వెలువరించింది.
చట్టబద్ధ నిబంధనలకు కట్టుబడుతూ పర్యావరణ ఆరోగ్య భద్రతాంశాల్లో అత్యుత్తమ పద్ధతులు పాటించి, సామాజిక బాధ్యతగా స్థానికుల్లోనూ వాటి మెరుగుదలకు కృషి చేస్తామని హామీ ఇచ్చింది. వాటిని నిర్లక్ష్యం చెయ్యబట్టే ఇంత ఉత్పాతం జరిగిందన్నది నిజం. నష్ట పరిహారంలో సహేతుకంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం, భోపాల్ అనుభవాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజల దీర్ఘకాలిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి.
ఇండియా స్థూల దేశీయోత్పత్తిలో మూడు శాతం వాటా కలిగిన రసాయన పరిశ్రమ- పెట్రోకెమికల్స్, ఎరువులు, పెయింట్లు, క్రిమిసంహారకాలు, బల్క్ డ్రగ్స్, ఔషధాల రూపేణా బహుముఖంగా విస్తరించి 70వేలకుపైగా వాణిజ్య ఉత్పాదనలతో విరాజిల్లుతోంది. రసాయన పరిశ్రమకు సంబంధించిన వివిధ అంశాల్ని 15చట్టాలు, 19 నిబంధనలూ నియంత్రిస్తున్నా- అవేవీ నేరుగా పరిశ్రమను దృష్టిలో ఉంచుకొని చేసినవి కాకపోవడం, 2012నుంచి జాతీయ రసాయన విధానం పెండింగులో ఉండటం నివ్వెరపరుస్తోంది.