Visa Issues: ప్రవాస వరుడు చేసే మోసాలకు కొందరు యువతలు (Marrying NRI ) విదేశాలకు వెళ్లలేక ఆగిపోతుంటే.. వీసాల్లో సమస్యల (Visa Implications)తో కొందరు ఆగిపోవాల్సివస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, జర్మనీ, జపాన్, ఐర్లాండ్, కెనడా, డెన్మార్క్ తదితర దేశాల్లో ఉద్యోగం చేస్తున్న జీవిత భాగస్వామి వద్దకు వెళ్లేందుకు ఏపీ, తెలంగాణల నుంచి సుమారు 3000-4000 మంది వరకు యువతులు వీసాలకు దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. వీరిలో నాలుగేళ్లుగా పుట్టింట్లో ఉన్న వారు 500-600 మంది వరకూ ఉన్నట్టు పోలీసు అధికారులు విశ్లేషిస్తున్నారు.
- తెలంగాణలో ఉప్పల్‌కు చెందిన యువతి బీటెక్ పూర్తిచేసి క్యాంపస్ కొలువు తెచ్చుకుంది. అమెరికాలో ఉంటున్న అబ్బాయితో పెళ్లిచేస్తే కుమార్తె జీవితం బాగుంటుందని తల్లిదండ్రులు భావించారు. మధ్యవర్తి ద్వారా వచ్చిన సంబంధం నచ్చడంతో ఘనంగా పెళ్లి చేశారు. మూడు నెలల తర్వాత అల్లుడు అగ్రరాజ్యం చేరాడు. అమ్మాయిని కాపురానికి తీసుకెళ్లాలని అడుగుతుంటే.. వీసా నిబంధనలు (VISA ISSUES) కఠినంగా ఉన్నాయంటూ వాయిదా వేస్తూ వచ్చాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తాత్కాలిక వీసాపై అక్కడ ఉంటున్న అతను ఆర్థిక అవసరాల కోసమే పెళ్లి చేసుకున్న విషయం వెలుగుచూడటంతో భోరుమన్నారు.
- ఏపీలోని విజయవాడ యువతికి నాలుగేళ్ల క్రితం అమెరికాలో ఉంటున్న యువకుడితో పెళ్లయింది (Marrying NRI ). హెచ్1 వీసా ఉన్న భర్త వద్దకు వెళ్లేందుకు దరఖాస్తు చేస్తే రెండుసార్లు తిరస్కరణకు గురైంది. తాను ప్రాసెస్ చేస్తున్నానంటూ భర్త చెబుతూ వచ్చాడు. 2019 తర్వాత కొవిడ్ నిబంధనలతో మరో రెండేళ్లు గడిచాయి. ఆమె తాజాగా మూడోసారి ప్రయత్నాలు ప్రారంభించింది.
అన్నీ పరిశీలించాకే ముందుకెళ్లాలి
ఆయా దేశాల నిబంధనలకు అనుగుణంగా జీవిత భాగస్వామికి వీసా మంజూరు చేస్తుంటారు. కొన్నిసార్లు సహజంగానే ఆలస్యమవుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రవాస పెళ్లికొడుకుల మోసాలూ వెలుగు చూస్తున్నాయి. అలాంటప్పుడు జీవిత భాగస్వామికి వీసా రావటం కష్టమవుతుంది. మధ్యవర్తుల మాటలను నమ్మకుండా పెళ్లికి ముందే యువకుడి పాస్‌పోర్టు రెన్యువల్, వీసా, ఉద్యోగం చేస్తున్న సంస్థ వివరాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలి.
- బి.సుమతి, డీఐజీ, తెలంగాణ మహిళా భద్రతా విభాగం