భారతీయ సంప్రదాయాల్లో మన పురాణాలు, ఇతిహాసాలకు ఉన్న ప్రాధాన్యత ఎంతో గొప్పది. వాటిలో ఒకటి రామాయణ మహాకావ్యం. ఎన్ని రకాలుగా చెప్పినా.... ఎంత గొప్పగా వర్ణించినా అందులోని తత్వం నిత్యనూతనమే. నాటకరూపంలో ఆకట్టుకున్నా... వెండితెరపై అలరించినా.... యానిమేషన్ రూపంలో ఔరా అనిపించినా... ఏదో ఒక రూపంలో రామాయణ గాథ భావితరాలను మెప్పిస్తూనే ఉంటుంది. అందులో భాగంగా మరో కొత్తరూపంలో కనిపిబోతుంది రమణీయమైన రామాయణ కావ్యం. అద్భుతమైన సాంకేతిక హంగులు హద్దుకొని వర్చువల్ టెక్నాలజీ రూపంలో ప్రజల ముందుకు రాబోతుంది.
వర్చువల్ రామకథను కనరండీ... 30మంది నిపుణులతో 4నెలలు
తెలంగాణలోని హైదరాబాద్లో ఇన్ఫినిటీ గేమింగ్ స్టూడియో ఈ రామాయణాన్ని తీర్చిదిద్దుతోంది. 30 మంది నిపుణులతో 4 నెలలుగా రామాయణ కావ్యాన్ని వర్చువల్ టెక్నాలజీలో రూపొందిస్తున్నారు. అయోధ్యలో రామమందిర శంకుస్థాపన సందర్భంగా వర్చువల్ రామాయణ ప్రచార చిత్రాన్ని ఇన్ఫినిటీ గేమింగ్ స్టూడియో విడుదల చేసింది.
వర్చువల్ రామకథను కనరండీ... రామాయణం గొప్పతనం వివరించే ప్రయత్నం
ఆన్లైన్, వర్చువల్ గేమ్స్‌ను అభివృద్ధి చేసే ఈ సంస్థ... భావితరాల పిల్లల కోసం రామాయణంలోని గొప్పతనాన్ని వివరిచేందుకు ఈ ప్రయత్నం చేస్తోంది. వర్చువల్‌లో 360 డిగ్రీల్లో రామాయణ ఘట్టాలను వీక్షించడంతోపాటు రామాయణ ఆటను కూడా ఆడుకునేలా రూపకల్పన చేశారు. భద్రాచలం స్థల పురాణ నేపథ్యంగా రామాయణంలోని కీలక సంఘటనలు పూర్తి చేసిన ఇన్ఫినిటీ... ఒక్కో ఘట్టం ఆధారంగా వీఆర్ రామాయణాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.
వచ్చే నెలలో తొలి భాగం విడుదల
దేశంలోనే తొలిసారిగా వర్చువల్ టెక్నాలజీలో తయారవుతోన్న రామాయణ గాథ.... తెలుగుతోపాటు భారతీయ భాషలన్నింటిలోనూ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇన్ఫినిటీ గేమింగ్ స్టూడియో సన్నాహాలు చేస్తోంది. వచ్చే నెలలో తొలి భాగాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు.
ఇవీ చూడండి: 'పోలీసులు ఏం చేస్తున్నారు... దిశచట్టం అమల్లో ఉందా..?'