రాష్ట్రంలో మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, వారి ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనలు పెరిగాయి. స్త్రీలపై జరిగిన మొత్తం నేరాల్లో స్వల్ప తగ్గుదల ఉన్నా, వారిపై భౌతిక దాడుల నేరాలు అదుపులోకి రాకపోవడం కలవరపరుస్తోంది. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనల్లో ఏపీ దేశంలో మొదటి స్థానంలో ఉండటం, గతేడాది దేశవ్యాప్తంగా జరిగిన ఈ తరహా ఘటనల్లో 33.14% మన రాష్ట్రంలోనే నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ కేసులు 2019లో 1,892 నమోదు కాగా.. 2020లో ఆ సంఖ్య 2,342కు పెరిగింది. ఏడాది వ్యవధిలో 23.78 శాతం మేర అధికమయ్యాయి.
*పని ప్రదేశాల్లో మహిళలను లైంగికంగా వేధించడం, స్త్రీలను రహస్యంగా చిత్రీకరించటం (వోయిరిజం) నేరాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో రెండో స్థానంలో ఉంది. 2020 సంవత్సరానికి సంబంధించి జాతీయ నేర గణాంక సంస్థ తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదిక ఈ వివరాలు వెల్లడించింది.
*ఏపీలో మహిళలపై 2019లో 17,746, 2020లో 17,089 నేరాలు జరిగాయి. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే గతేడాది 3.70 శాతం మేర తగ్గాయి. ఈ తరహా నేరాలు అత్యధికంగా జరిగిన రాష్ట్రాల జాబితాలో 2019లో పదో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ 2020లో ఎనిమిదో స్థానానికి వెళ్లింది.
*పని ప్రదేశాల్లో మహిళల్ని లైంగికంగా వేధించిన ఘటనల్లో హిమాచల్‌ప్రదేశ్ (72 కేసులు) దేశంలో మొదటిస్థానంలో ఉండగా.. 70 కేసులతో ఏపీ రెండో స్థానంలో ఉంది.
*స్త్రీలను రహస్యంగా చిత్రీకరించిన ఘటనలు అత్యధికంగా చోటుచేసుకున్న రాష్ట్రాల జాబితాలో ఏపీది రెండో స్థానం. మహారాష్ట్రలో ఈ తరహా కేసులు 201 నమోదు కాగా.. ఏపీలో 124 కేసులు పెట్టారు.
పరిచయస్తులే అత్యాచార నిందితులు