గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రోజు గడువు పొడిగించింది. తొలుత నోటిఫికేషన్ లో పేర్కొన్న ప్రకారం శనివారం రాత్రి 11:50గంటలతో గడువు ముగియనుండగా... దాన్ని ఈరోజు రాత్రి 11:50వరకూ పొడిగిస్తున్నట్లు పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ ప్రకటించారు. వరద పరిస్థితుల దృష్ట్యా గడువు పొడిగించాలని కోరుతూ అభ్యర్థుల నుంచి వచ్చిన వినతులపై సీఎం జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
కేటిగిరి-1కు ఎక్కువ పోటీ...
శనివారం రాత్రి 8:30 గంటల సమయానికి మొత్తంగా 21 లక్షల 64వేల 490 మంది అభ్యర్థులు ధరఖాస్తు చేసుకున్నారు. కేటగిరి-1కి 12లక్షల 36వేల 277, కేటగిరి-2(A)కి లక్షా34వేల371, కేటగిరి-2(B)కి లక్షా 63వేల744 కేటగిరి-3కి 6లక్షల30వేల098 ధరఖాస్తులు వచ్చాయి. శనివారం ఒక్క రోజే 120300 దరఖాస్తులొచ్చాయి. ఇక మరో రోజు గడువు ఇవ్వటంతో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది.