ఆ మార్కులు కలిపితే.. సచివాలయ ఉద్యోగం! రాష్ట్రంలో కొన్నేళ్లుగా పనిచేస్తున్న ఒప్పంద కార్మికులకు గ్రామ సచివాలయ ఉద్యోగ నియామకాల్లో గరిష్ఠంగా 15 మార్కులు కలపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేప్పుడు తదనుగుణంగా ఆప్షన్‌ను ఎంచుకోవాలని సూచించింది. అయితే కొద్దిపాటి అవగాహనా లేమితో జరిగిన పొరపాటు వల్ల చాలా మందికి ఆ మార్కులు కలవక ఉద్యోగాలకు దూరమయ్యారు.
తెలియక చేశాం!
గ్రామ సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు సమయంలో ఒప్పంద కార్మికులు ఆన్‌లైన్‌లో ఓ ఆప్షన్ పెట్టారు. చాలామంది అవగాహన లేక దానిని ఎంచుకోలేదు. ఈ కారణంగా మార్కులు తగ్గి ఉద్యోగానికి ఎంపిక కాలేదు. సాధారణంగా మిగతా నియామక ప్రక్రియల్లో ఏదో ఒక ఆప్షన్ తప్పనిసరిగా ఎంచుకోకపోతే ఆ దరఖాస్తు ముందుకెళ్లదు. గ్రామ సచివాలయాల దరఖాస్తు ప్రక్రియలో ఆ తరహా ఏర్పాటు చేయలేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.
ఆప్షన్ పెట్టినా... కలపలేదు
గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కేంద్రాల నిర్వాహకులకు సరైన అవగాహన లేక వెయిటేజీ మార్కుల కోసం పెట్టిన ఆప్షన్ గురించి తెలియలేదని అభ్యర్థులు వాపోతున్నారు. తాడేపల్లిలోని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్‌ను కలిసిన వారు... తమ పొరపాటును అర్థం చేసుకుని వెయిటేజీ మార్కులు కలపాలని కోరారు. మరోవైపు... తాము దరఖాస్తు సమయంలో ఆప్షన్ పెట్టుకున్నా... వెయిటేజీ మార్కులు కలపలేదని కొంతమంది అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. కొందరు హైకోర్టును ఆశ్రయించటంతో... దీన్ని పరిశీలించి వారం రోజుల్లోగా పరిష్కరించాలని న్యాయస్థానం ఆదేశించింది. కొన్ని పోస్టులకు తగినంత మంది ఎంపిక కాకపోవటంతో... కటాఫ్ కన్నా తక్కువ వచ్చిన వారికి 15 గ్రేస్ మార్కులు కలపాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటితో పాటు తమ సర్వీసుకు రావాల్సిన మార్కులు కలిపితే తమకు ఉద్యోగం దక్కుతుందని అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:
సచివాలయ ఉద్యోగాల్లో 'గ్రేస్'తో జోష్