రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించిన గ్రామ సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థను పంచాయతీరాజ్ చట్ట పరిధిలోకి తీసుకురానున్నారు. ఈ మేరకు చట్టంలో ఎలాంటి సవరణలు చేయాలనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. గత 2 రోజులుగా తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి చెల్లప్ప ఆధ్వర్యంలో నిపుణుల బృందం దీనిపై చర్చించింది. మరో 2, 3 సార్లు సమావేశమై.. చట్టంలో సవరణలకు సంబంధించి ముసాయిదా సిద్ధం చేయనున్నారు.
ఆగస్టు 15న గ్రామ వాలంటీర్లు, అక్టోబర్ 2న గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభమైంది. సచివాలయాల్లో వివిధ ప్రభుత్వ శాఖల తరఫున నియమితులైన 11 మంది ఉద్యోగులు సేవలు అందించనున్నారు. పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో సచివాలయాలు నిర్వహిస్తుంటే.. వేర్వేరు ప్రభుత్వశాఖల తరఫున ఉద్యోగులు పనిచేయటంతో పరిపాలన, సాంకేతికపరంగా సమస్యలు తలెత్తడాన్ని అధికారులు గుర్తించారు. వీరితోపాటు వాలంటీర్లను సైతం పంచాయతీరాజ్ చట్ట పరిధిలోకి తీసుకురావడానికి చేయాల్సిన సవరణలపై 2 రోజుల సమావేశంలో ప్రధానంగా చర్చించారు.