కరోనా వస్తే పారాసిటమాల్‌తో పోయేదానికి తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆస్పత్రిలో ఎందుకు చేరారని మాజీ ఎంపీ, భాజపా నేత విజయశాంతి ఎద్దేవా చేశారు. కొవిడ్ విషయంలో కేసీఆర్ పలుమార్లు నిర్లక్ష్యంగా మాట్లాడారని ఆక్షేపించారు. పారాసిటమాల్ గోలీతో కరోనా తగ్గుతున్నట్లు ప్రజలకు భ్రమ కల్పించారని విమర్శించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం శ్రీరామ్ నగర్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని విజయశాంతి సందర్శించారు. అక్కడ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు.
అనంతరం వ్యాక్సిన్ కోసం వచ్చిన ప్రజలతో మాట్లాడారు. వ్యాక్సిన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. దేశంలో అందరికీ వ్యాక్సినేషన్ పూర్తైన తర్వాతనే ప్రజలంతా మాస్కు తీయాలని విజయశాంతి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ టీకాలు పూర్తిగా ఉచితంగానే అందిస్తున్నారని వెల్లడించారు. సమీప కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ సెంటర్లలో ప్రజలు టీకాలు వేయించుకోవాలని సూచించారు.
కరోనా విషయంలో కేసీఆర్ పలుమార్లు నిర్లక్ష్యంగా మాట్లాడారు. సీఎంకు కరోనా సోకితే యశోదా ఆసుపత్రిలో ఎందుకు చికిత్స తీసుకున్నారు. పారాసిటమాల్ గోలితో కరోనా పోతున్నట్లు భ్రమ కల్పించారు. ఆయన బాధ్యతారాహిత్యం వల్లే ఎంతో మంది చనిపోయారు. -విజయశాంతి, మాజీ ఎంపీ, భాజపా నేత