తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొన్ని పల్లెల్లో సాకారమైన అభివృద్ధిని తరచి చూడాల్సిందే. అనుసరించాల్సిందే. వనపర్తి జిల్లాలోని చిన్నమందడి గ్రామం రోడ్లకు ఇరువైపులా చెట్లతో ఆకట్టుకుంటుంది. చక్కటి రహదారులు. ఇంటింటికి కొళాయిలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు దర్శనమిస్తాయి. ప్రస్తుతం ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమంలో ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగా 2013 నుంచే ఈ గ్రామంలో అమలవుతున్నాయి. ఇందులో ప్రస్తుత సర్పంచి సూర్యచంద్రారెడ్డి కృషి కూడా ఉంది. గ్రామాభివృద్ధిలో రైతు కమిటీలు, పాఠశాల కమిటీ, దేవాలయ కమిటీ, విద్యాకమిటీ, పారిశుద్ధ్య నిర్వహణ కమిటీ, మద్య నిషేధ కమిటీల పాత్ర గణనీయం. ఇవి ఆయా రంగాలకు సంబంధించి చర్చలు జరుపుతూ గ్రామస్థులకు సూచనలు చేస్తాయి. రోడ్డు పక్కన స్టీలు బుట్టలు ఏర్పాటు చేశారు. రహదారులపై పడ్డ చెత్తను గ్రామస్థులే అందులో వేస్తారు. వారానికి ఒకసారి మహిళలు వీధుల్లోకి వచ్చి రోడ్లన్నీ ఊడ్చి శుభ్రం చేస్తారు. గర్భిణులు, బాలింతలకు గ్రామ పంచాయతీ తరఫున ఓ స్వచ్ఛంద సంస్థ నిత్యం అరకిలో కూరగాయలు, పండ్లను పంపిణీ చేస్తోంది. కేంద్రం ఈ గ్రామానికి 2018-19లో నిర్మల్ గ్రామ పురస్కారాన్ని అందించింది.
వేలిముద్ర అంటే తెలియదు:ప్రతి గ్రామంలో కొందరైనా నిరక్షరాస్యులు ఉంటారు. వయస్సు మళ్లినవారు, రైతుల్లో ఎక్కువగా చదువుకోని వారు కనిపిస్తారు. నారాయణపేట జిల్లా అప్పంపల్లి గ్రామంలో మాత్రం వేలి ముద్ర వేసేవారు ఒక్కరూ లేరు. నలభై ఏళ్లుగా సాగుతున్న కృషి ఫలితం ఇది. 1980 ప్రాంతంలో వీఐపీ (గ్రామీణ భాగస్వామ్య సంస్థ), ఏవీజీఎస్ (అప్పంపల్లి గ్రామ వికాస్ సమితి)లు ఇందుకు ఎంతో కృషి చేశాయి. గ్రామానికి చెందిన బాల్‌రెడ్డి, అనంత్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, లక్ష్మికాంత్ రెడ్డిలు ఈ యజ్ఞంలో కీలక పాత్ర పోషించారు. అనియత విద్య, రాత్రి బడి ద్వారా కొన్నేళ్లుగా సాగిన యజ్ఞంతో ప్రస్తుతం పుస్తకాలు, దిన పత్రికలు చదివే స్థాయికి గ్రామస్థులను తీసుకొచ్చారు. ప్రస్తుతం ఏవీజీఎస్ ద్వారా గ్రామంలోని ప్రతి చిన్నారి పాఠశాలకు విధిగా వెళ్లేలా కృషి చేస్తున్నారు. ఆగస్టు 15న గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేయనున్నారు. 10 కంప్యూటర్లను ఏర్పాటు చేసి స్థానిక యువతకు శిక్షణ ఇవ్వడానికి సమితి ముందుకు వచ్చింది. నలభై ఏళ్లుగా 100శాతం కుటుంబ నియంత్రణ అమలవుతున్న గ్రామంగానూ దీనికి గుర్తింపు ఉంది.