ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా చికిత్స మాటున అడ్డగోలు దోపిడీ.. పలువురిపై కేసు నమోదు - corona care centers news

కరోనా కల్లోలం కొందరికి కాసులు కురిపిస్తోంది. రోగుల దీనస్థితిని ప్రైవేట్ ఆస్పత్రులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. అందినకాడికి అధిక ఫీజులతో దండుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఫిర్యాదులు అందడంతో తనిఖీ బృందాలు రంగంలోకి దిగాయి. పలుచోట్ల అవకతవకలు గుర్తించిన అధికారులు.. ఆయా ఆస్పత్రులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపారు.

covid private hospitals
ప్రైవేట్ ఆస్పత్రుల దాడులు

By

Published : Apr 29, 2021, 7:20 AM IST

ప్రైవేట్ ఆస్పత్రుల దాడులు

కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా.. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై ఫ్లైయింగ్ స్క్వాడ్స్ అధికారులు దాడులు చేశారు. విజయనగరం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, గుంటూరు, అనంతపురం, కడప జిల్లాల్లోని ఆసుపత్రుల్లో అవతవకలకు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల కన్నా అధికంగా వసూలు చేయడం, ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే వారిని చేర్చుకోకపోవడం, రెమ్​డెసివిర్ మందులను పక్కదారి పట్టించడం వంటి అక్రమాలకు పాల్పుడుతున్నట్లు గుర్తించారు. మొత్తం 9 ఆస్పత్రులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక పోలీసులకు విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు.

ఆస్పత్రులపై కేసులు..

రోగుల నుంచి అధిక ధరలు వసూలు చేయడమే గాక.. తక్కువ పడకలకు అనుమతి తీసుకుని ఎక్కువ మందికి చికిత్స అందిస్తున్నారన్న ఆరోపణలపై అనంతపురంలోని ఎస్వీ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, తిరుపతిలోని రమాదేవి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిపై కేసులు నమోదు చేయడమే గాక..ఎస్వీ ఆస్పత్రి ఎండీ రవిబాబు, రమాదేవి ఆస్పత్రి నోడల్ అధికారి కిషోర్ యాదవ్​ను అరెస్ట్ చేశారు.

రోజుకు 10 నుంచి 30 వేలు వసూళ్లు..

తిరుపతి, కర్నూలు, నరసరావుపేటలోని పలు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద రోగులను చేర్చుకోవడం లేదని గుర్తించారు. అడ్వాన్స్ ఫీజు చెల్లిస్తేనే చేర్చుకుంటున్నారని.. రోజుకు 10 నుంచి 30వేల వరకు వసూలు చేస్తున్నారని విచారణలో తేలింది. కడపలోనూ ఓ ఆస్పత్రిలో రోజుకు 30వేలు తీసుకోవడంతోపాటు ఆక్సిజన్ కోసం అదనంగా వసూలు చేస్తున్నట్లు గుర్తించారు.

నల్లబజార్​కు రెమ్​డెసివర్​..

కోవిడ్ చికిత్సలో వాడుతున్న రెమ్​డెసివిర్ ఇంజక్షన్లను.. అక్రమంగా విక్రయిస్తున్న వారిపై విజయవాడ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ ఇంజక్షన్లు.. అక్రమంగా విక్రయిస్తున్న పలువుర్ని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఒంగోలులో ఓ ఆస్పత్రిలో ఇంజక్షన్ల వినియోగంలో ఆవకతవకలు గుర్తించారు. నెల్లూరులో రెమ్​డెసివిర్ ఇంజక్షన్లు నల్లబజారుకు తరలించిన ఓ ఆస్పత్రి నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. విజయనగరం, కర్నూలులోనూ కేసులు నమోదు చేశారు. అవకతవకలకు పాల్పడిన ఆస్పత్రి యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

కరోనా కల్లోలం వేళ.. మంటగలుస్తున్న మానవత్వం

సైకిల్‌పై భార్య శవం.. దిక్కుతోచని స్థితిలో భర్త

ABOUT THE AUTHOR

...view details