ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Venkaiah naidu: 'రామాయణం మత గ్రంథంగా చూడొద్దు.. విద్యార్థులకు బోధించాలి' - ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తాజా వార్తలు

హైదరాబాద్​లోని దసపల్లా హోటల్​లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారి కొమండూర్ శశికిరణ్ రచించిన శ్రీమద్రామాయణం(ramayana written by shashikiran) పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(vice president venkaiah naidu latest news) ఆవిష్కరించారు. ఈతరం యువతకు అర్ధమయ్యే విధంగా సులభమైన పదాలతో, పద్యాల రూపంలో రామాయణాన్ని రచించిన రచయితను, ప్రచురించిన ఎమెస్కో బుక్స్​కు ఆయన అభినందనలు తెలియజేశారు.

వెంకయ్య నాయుడు
వెంకయ్య నాయుడు

By

Published : Nov 19, 2021, 7:44 AM IST

హక్కులను పొందడం కంటే ముందు, మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం అత్యంత ఆవశ్యకమని, మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముని జీవితం ఈ విషయాన్నే తెలియజేస్తోందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(vice president venkaiah naidu latest speech) పేర్కొన్నారు. భారతీయ సంస్కృతికి చుక్కానిగా నిలిచిన రామాయణం నుంచి, శ్రీరాముని జీవితం నుంచి యువత స్ఫూర్తి పొందాలని ఆయన ఆకాంక్షించారు. హైదరాబాద్​లోని దసపల్లా హోటల్​లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారి కొమండూర్ శశికిరణ్ రచించిన శ్రీమద్రామాయణం (పద్యకావ్యం) పుస్తకాన్ని(ramayana written by shashikiran) ఆయన ఆవిష్కరించారు. ఈతరం యువతకు అర్ధమయ్యే విధంగా సులభమైన పదాలతో, పద్యాల రూపంలో రామాయణాన్ని రచించిన రచయితను, ప్రచురించిన ఎమెస్కో బుక్స్​కు ఆయన అభినందనలు తెలియజేశారు.

రామాయణం అంటే రాముడి కథ మాత్రమే కాదని, మనిషిగా పుట్టి, మనిషిగా జీవించి, మనిషి ఎలా బతకాలో దిశానిర్దేశం చేసిన మహనీయుని జీవితమన్న ఉపరాష్ట్రపతి.. మనిషి జీవితంలోని వివిధ సందర్భాల్లో ఎలా వ్యవహరించాలో, వివిధ అనుబంధాలకు ఎలాంటి గౌరవాన్ని ఇవ్వాలో ఆయన గాథ తెలియజేస్తుందన్నారు. భారతీయ కుటుంబ వ్యవస్థకు ప్రతిబింబంగా, పితృవాక్పరిపాలకుడిగా, సత్యవాక్పరిపాలకుడిగా, ఏకపత్నీవ్రతుడిగా, సోదరులకు, నమ్మిన వారికి ఆప్యాయతను పంచినవాడిగా, ఆదర్శ పాలకుడిగా ఆదర్శంగా నిలిచిన శ్రీరాముడు, ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మాన్ని మాత్రమే పాటిస్తూ, ప్రతి అడుగులోనూ ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపిన పురుషోత్తముడని తెలిపారు.

రామాయణాన్ని మతానికి చెందిన గ్రంథంగా చూడడం తగదన్న ఆయన, విద్యార్థులకు పాఠ్యప్రణాళికలో భాగంగా రామాయణాన్ని బోధించాలని సూచించారు. మన గ్రంథాలను సరైన వారిద్వారా, సరైన మార్గంలో తెలుసుకోవడం అత్యంత ఆవశ్యకమన్నారు. నాయకత్వ లక్షణాలు, నిర్వహణా చాతుర్యం, సుపరిపాలన, వనరులను సరైన విధంగా వినియోగించుకునే సామర్థ్యం, వ్యాపార సంబంధాలను, వ్యూహాత్మక పరిచయాలను పెంపొందించుకోవడం వంటి విజయానికి అవసరమైన వృత్తి పరమైన కీలక నైపుణ్యాలను శ్రీరాముని గాధ మనకు బోధిస్తుందని తెలిపారు.

రామాయణం లాంటి మహా కావ్యాలను రాయాలంటే ఎంతో మానసిక పరిపక్వత అవసరమన్నారు ఉపరాష్ట్రపతి. రామాయణం రాయని వారు కవులు కారు.. అనే లోకోక్తి ఉన్నప్పటికీ చాలా మంది ఐదుపదులు దాటే వరకూ రామాయణం జోలికి పోరని.. శశికిరణ్ మాత్రం మూడుపదుల వయసులోనే మొదలు పెట్టి, నాలుగు పదులకే పూర్తి చేయడం అభినందనీయమన్నారు. గణ, యతి, వ్యాకరణ నియమాలు పాటిస్తూ... పూర్తిగా ఛందోబద్ధమైన సాహిత్య లక్షణాలు పాటిస్తూ...ప్రజల వాడుక భాషలో రామాయణ మహాకావ్యం రాసిన రచయిత ప్రయత్నం యువతకు ప్రేరణాత్మకమని తెలిపారు. ఇదే కోవలో యువత నుంచి మరిన్ని పుస్తకాలు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత శశికిరణ్, శృంగేరి ఆస్థాన పండితులు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి, ఎమెస్కో సీఈఓ విజయకుమార్, సంపాదకులు చంద్రశేఖర్ రెడ్డి సహా పలువురు తెలుగు భాషాభిమానులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

తీరం దాటనున్న వాయుగుండం... రాష్ట్రానికి భారీ వర్షసూచన

ABOUT THE AUTHOR

...view details