Sri Ramanuja sahasrabdi utsav: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ శ్రీరామనగరంలో సమతామూర్తి సహస్రాబ్ది ఉత్సవాలు పదకొండో రోజు శోభాయమానంగా జరుగుతున్నాయి. అష్టాక్షరీ మహా మంత్రి జపంతో పూజలు ప్రారంభమయ్యాయి. భీష్మఏకాదశి సందర్భంగా 114 యాగశాలల చుట్టూ చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో రుత్వికులు ప్రదక్షిణ చేశారు. సమతామూర్తి కేంద్రాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ సందర్శించారు. క్షేత్రంలోని 108 దివ్య దేశాలను ఉపరాష్ట్రపతి దర్శించుకున్నారు. సమతామూర్తి రామానుజాచార్యుల విశిష్టతను ఆయనకు చినజీయర్ స్వామి వివరించారు. దైవభక్తి, దేశభక్తి ఉన్నచోట సమగ్రాభివృద్ధి ఉంటుందని బండారు దత్తాత్రేయ అన్నారు. నైతిక విలువల పెంపునకు ఈ కేంద్రాలు దోహదపడతాయని.. సమతామూర్తిని సందర్శించడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. యాగశాలలో నిర్వహిస్తున్న లక్ష్మీనారాయణ మహాయాగంలో వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు.
"సమతామూర్తి ప్రతిమ సందర్శన మహాద్భాగ్యంగా భావిస్తున్నాను. భారతీయ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సమతామూర్తి ప్రతిమ ప్రేరణ కలిగిస్తుంది. ఆధ్యాత్మికవేత్తగా సామాజిక సంస్కరణ అభిలాషి రామానుజాచార్యులు. ప్రతి ఒక్కరూ సమానమని వెయ్యేళ్ల కిందటే చాటారు. ప్రపంచంలోని ఏడు అద్భుతాల తర్వాత.. సమతామూర్తి కేంద్రం ఎనిమిదో అద్భుతం. దళితులను ఆలయ ప్రవేశం చేయించి గొప్ప మానవతా వాది అనిపించుకున్నారు. కులం కన్నా గుణం మిన్నా అని చాటారు. శ్రీరామనగరంలో సమతామూర్తి విగ్రహాన్ని ఆవిర్భవించడం ఆనందించాల్సిన విషయం." --వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి
రేపు ఒంటిగంట వరకే అనుమతి
సమతామూర్తి కేంద్రాన్ని మెగాస్టార్ చిరంజీవి దంపతులు, దర్శకుడు హరీశ్ శంకర్, నిర్మాత దిల్ రాజు సందర్శించారు. దివ్యక్షేత్రానికి భారీగా సందర్శకులు తరలివచ్చారు. వారాంతం కావడంతో భక్తులు, సందర్శకుల రద్దీ పెరగడంతో.. కేంద్రం వద్ద కి.మీ మేర బారులు తీరారు. కాగా రేపు ముచ్చింతల్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాక దృష్ట్యా సమతామూర్తి కేంద్రంలో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా రేపు మధ్యాహ్నం ఒంటి గంట వరకే భక్తులకు అనుమతి ఉందని సీపీ వెల్లడించారు.