telugu university celebrations: ఇంటర్నెట్ను ఎంతవరకు వాడాలో అంతే వాడాలని.. నెట్ ఎక్కువ వాడితే డెట్ అయిపోతారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్లోని తెలుగు వర్సిటీ 36వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వెంకయ్య నాయుడు హాజరయ్యారు.
పాశ్చాత్య వ్యామోహంలో పడి తెలుగు భాషా సంస్కృతిని మరవొద్దని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.తెలుగుభాషా సంస్కృతిని, సాహిత్యాన్ని పరిరక్షణకు తెలుగు విశ్వవిద్యాలయం చిరునామాగా మారిందని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. తెలుగు విశ్వవిద్యాలయాన్ని కాపాడుకుంటా మరింత వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేయడం అవసరమని తెలిపారు.
తెలుగు విశ్వవిద్యాలయం స్థాపన ద్వారా తెలుగుభాష పరిరక్షణకు స్వర్గీయ నందమూరి తారక రామారావు కృషి చేశారని గుర్తుచేశారు. తెలుగు అభివృద్ధి ప్రయత్నాలు విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు వర్సిటీని మరింత మంచిగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తెలుగు విశ్వవిద్యాలయాన్ని బాచుపల్లిలో 100ఎకరాల సువిశాల ప్రాంగణంలోకి తరలించే ప్రయత్నాలు అభినందనీయమని అన్నారు.
ప్రపంచీకరణ నేపథ్యంలో ఎల్లలు చెరిగిపోతూ ఉన్నాయి. ఎల్లలు చెరిగినంత మాత్రాన.. మన గతం ఏమిటి..? అనే విషయాన్ని ఎవ్వరూ మరవకూడదు. మన సంప్రదాయం, మన భాష, మన వేషం, మన సంస్కృతి, మన మాట, మన ఆట, మన పాట, మన యాస, మన గోస, మన కట్టు, మన బొట్టు, వీటిని మనం కాపాడుకుంటూ ఉండాలి. అదే మన ప్రత్యేకత, మన ఉనికిగా నిలుస్తోంది. నువ్వు ఎవరంటే నేను పలనా అని చెప్పగలిగి ఉండాలి. వీటన్నింటికీ సమాధానం ఎవరైనా అడిగితే అదే మన సంస్కృతి. దాన్ని వ్యక్తీకరించే భాష. వాటిని మనం కాపాడుకోవాలి. మాతృభాష కల్లలాంటిది అయితే.. విదేశీ భాష కల్లద్దాల్లాంటిది. కళ్లుంటే కళ్లద్దాలు బాగుంటాయి. కళ్లు లేకపోతే ఎంత ఖరీదైన కళ్లద్దాలైనా పని చేయవు. - వెంకయ్య నాయుడు, ఉప రాష్ట్రపతి