ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఒక రోజు మాతృభాషలోనే మాట్లాడాలి: వెంకయ్య నాయుడు - ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వార్తలు

ప్రతీ ఒక్కరూ ప్రయోగాత్మకంగా వారంలో ఒక రోజు పూర్తిగా మాతృభాషలోనే మాట్లాడాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగం, తెలుగు అకాడమీ సంయుక్తంగా జ్ఞాన సముపార్జన మాధ్యమం-మాతృభాష అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల అంతర్జాతీయ అంతర్జాల సదస్సులో ఉప రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఒక రోజు మాతృభాషలోనే మాట్లాడాలి: వెంకయ్య నాయుడు
ఒక రోజు మాతృభాషలోనే మాట్లాడాలి: వెంకయ్య నాయుడు

By

Published : Jul 29, 2020, 8:15 PM IST

మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలన్న ఉపరాష్ట్రపతి

ఉపాధి రంగంలో మాతృభాషను భాగస్వామ్యం చేయాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. మాతృభాషను సాహిత్యం, సృజనకే పరిమితం చేయకుండా... ఉపాధికి ముడి పెట్టాలన్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగం, తెలుగు అకాడమీ సంయుక్తంగా జ్ఞాన సముపార్జన మాధ్యమం-మాతృభాష అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల అంతర్జాతీయ అంతర్జాల సదస్సులో ఉప రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతీ ఒక్కరూ ప్రయోగాత్మకంగా వారంలో ఒక రోజు పూర్తిగా మాతృభాషలోనే మాట్లాడాలని సూచించారు. ఆ ప్రయత్నంలో మాతృభాషలో దొరకని పదాలను గుర్తించే ప్రయత్నం చేయాలన్నారు.

మనిషికి మాతృభాష జీవనాడి

మాతృభాషపై నిరంతర పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ప్రతి మనిషికి మాతృభాష జీవనాడి అని.. అస్తిత్వానికి పట్టుకొమ్మ వంటిదన్నారు. మాతృ భాషలోనే విద్య, పరిపాలన సాగాలని ఆయన ఆకాంక్షించారు. మాతృభాషను ప్రేమించాలి కానీ.. ఇతర భాషలను ద్వేషించాల్సిన అవసరం లేదన్నారు. ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలని.. ఉన్నత విద్యలో ఒక బోధన అంశంగా ఉంటే.. అమ్మభాష మనుగడలో ఉంటుందని.. పాలకులు ఈ విషయాన్ని గుర్తించాలన్నారు.

ఆధునిక అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాలి

ఆంగ్ల భాషతోనే అభివృద్ధి జరుగుతుందన్న అభిప్రాయం సరికాదని.. దేశాధినేతలు కూడా విదేశాలకు వెళ్లినప్పుడు మాతృభాషలోనే మాట్లాడతారని ఆయన తెలిపారు. పాఠశాలలు, పరిపాలన, న్యాయస్థానాలు మాతృభాషలోనే కొనసాగాలని ఆకాంక్షించారు. భాషను ఆధునిక అవసరాలకు అనుగుణంగా మార్చుకోవడం తప్పేమీ కాదన్నారు. ప్రచార, ప్రసార మాధ్యమాలు మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అంతరించిపోతున్న మాతృభాష పదాలను వెతికి పట్టుకోవాలన్నారు.

ఇదే సరైన సమయం

మాతృభాషపై పట్టు ఉంటే శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాన్యులకు చేర వేయవచ్చునన్నారు. అమ్మ భాషకు పట్టిన మసిని తొలగించడానికి ఇదే సరైన సమయమని ఉప రాష్ట్రపతి పేర్కొన్నారు. సదస్సులో డీఆర్ డీఓ ఛైర్మన్ జి. సతీష్ రెడ్డి, శాంత బయోటెక్ ఛైర్మన్ వర ప్రసాద్ రెడ్డి, హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం ఉప కులపతి అప్పారావు, తెలుగు అకాడమీ సంచాలకుడు సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.

ఇవీ చూడండి:

తాత్కాలికంగా వైద్యుల నియామకాలు.. కలెక్టర్లకు ప్రభుత్వ ఆదేశాలు

ABOUT THE AUTHOR

...view details