Vice President: విభజన చట్టం, ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వివిధ సంస్థల పురోగతి గురించి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వరుసగా రెండో రోజు వివిధశాఖల కేంద్ర మంత్రులతో చర్చించారు. బుధవారం పార్లమెంటులోని తన ఛాంబర్‌లో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, ప్రహ్లాద్ జోషిలతో ప్రత్యేకంగా సమావేశమై వారిశాఖల పరిధిలోని ప్రాజెక్టులను త్వరగా పూర్తయ్యేలా చూడాలని కోరారు. ఏవైనా సమస్యలుంటే రాష్ట్ర మంత్రులు, అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా కొలిక్కి తేవాలని సూచించారు. అనంతపురంలోని పాలసముద్రంలో ఏర్పాటు చేసిన బీఈఎల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ పురోగతి గురించి రక్షణశాఖ మంత్రితో చర్చించారు.
పాలసముద్రంవద్ద నిర్మించిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఎక్సైజ్ అండ్ నార్కోటిక్స్ గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో మాట్లాడి పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న వివిధ కేంద్ర సంస్థలకు నిధుల విడుదల విషయంపై ఆమెతో చర్చించారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మిథాని, నాల్కో సంస్థల ఉమ్మడి భాగస్వామ్యంతో నెల్లూరులో తలపెట్టిన హై ఎండ్ అల్యూమినియం మిశ్రమం అభివృద్ధి, తయారీ సంస్థ పనులపై మంత్రి ప్రహ్లాద్ జోషితో చర్చించారు. ఇదే విషయమై రాజ్‌నాథ్ సింగ్‌తోనూ మాట్లాడారు.