ఓ విద్యార్థి ప్రతిభను ప్రోత్సహించడానికి ఉపరాష్ట్రపతి 9 నిమిషాల పాటు తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. హైదరాబాద్‌లోని స్వర్ణ భారత్ ట్రస్ట్ ప్రాంగణంలో నైపుణ్య శిక్షణ కార్యక్రమాల ముగింపు వేడుకలకు ఉపరాష్ట్రపతి హాజరయ్యారు. ఈ విషయం తెలిసి శంషాబాద్ మండలం మదనపల్లి పాత తండాకు చెందిన ఇంటర్ విద్యార్థి శివ అక్కడకు వచ్చాడు. ఎవరి చిత్రమైనా తలకిందులుగా ప్రారంభించి 10 నిమిషాల్లో వేయడంలో శివ దిట్ట.
వెంకయ్య ఆశ్యర్యం..
ఉప రాష్ట్రపతి చిత్రాన్ని 9నిమిషాల్లో వేస్తానని.. ఆయనకు బహుమతిగా ఇవ్వాలని వేచి చూస్తున్నానని భద్రతాసిబ్బందిని వేడుకున్నాడు. దీంతో వారు అనుమతించారు. అప్పటికే విమానాశ్రయానికి బయలుదేరడానికి సమాయత్తమవుతున్న ఉపరాష్ట్రపతి వద్దకు శివ వెళ్లి "సర్.. మీ చిత్రం వేస్తాను"అని విజ్ఞప్తి చేశాడు. "ఇప్పటికే ఆలస్యమైంది. నా రాక కోసం శంషాబాద్, దిల్లీ విమానాశ్రయాల్లో ఉన్నతాధికారులు ఎదురు చూస్తున్నారు. అంటూనే... "సరే 10 నిమిషాలు ఆగుతా... వేయి చూద్దాం" అన్నారు వెంకయ్యనాయుడు. శివ.. కేవలం 9 నిమిషాల్లోనే చిత్రాన్ని వేసి బహూకరించడంతో వెంకయ్యనాయుడు ఆశ్చర్యపోయారు.
ఇదీ చదవండి:పుస్తకాలు చదువుతా.. కుంగ్‌ఫూ నేర్చుకున్నా!