MS Swaminathan Awards Ceremony: సంప్రదాయ వ్యవసాయ విధానాలకు సాంకేతికతను జోడిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. భారతీయ వ్యవసాయ రంగాన్ని లాభసాటి, సుస్థిర, పర్యావరణ మార్పులను తట్టుకునేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో విశ్రాంత ఐసీఏఆర్ ఎంప్లాయిస్ అసోసియేషన్, నూజివీడు సీడ్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 7వ ఎంఎస్ స్వామినాథన్ పురస్కార కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావుకు.. ఎంఎస్ స్వామినాథన్ పురస్కారాన్ని వెంకయ్య అందజేశారు. బిందు సేద్యం, సూక్ష్మ సాగు నీటి పద్ధతులను పాటించేలా రైతులకు మార్గనిర్దేశం చేస్తూ.. రైతులు పంట ఉత్పత్తులు పెంచుకునేలా చేయడంలో డాక్టర్ ప్రవీణ్‌రావు కృషిచేశారని అభినందించారు.
అద్భుతమైన భవిష్యత్తు ఉంది..
భారతదేశంలో వ్యవసాయ రంగానికి అద్భుతమైన భవిష్యత్తు ఉందని.. కావాల్సిందల్లా ఈ రంగానికి సరైన సమయంలో అవసరమైన చేయూత అందించడమని అన్నారు. రైతులకు సమయానుగుణంగా సూచనలు చేస్తూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. తృణధాన్యాల ఉత్పత్తిని మెల్లిగా తగ్గిస్తూ పప్పుధాన్యాలు, నూనెగిజలు, సిరిధాన్యాల ఉత్పత్తి దిశగా రైతులను ప్రోత్సహించాలని నొక్కిచెప్పారు.