ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పెద్దల సభకే 'సమయం' నేర్పిన నేత.. వెంకయ్యనాయుడు

venkaiah naidu journey as vice president : "ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ప్రభుత్వాలు విజయవంతంగా అమలు చేయాలంటే పార్లమెంట్ బిల్లులను సకాలంలో ఆమోదించాలి. దానికి అనుగుణంగా సభ్యులు హుందాగా నడుచుకోవాలి". 2017లో భారతదేశ ఉపరాష్ట్రపతిగా బాధ్యతల స్వీకరణకు ముందురోజు వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలివి. ప్రజల తీర్పును చట్టసభల్లోని సభ్యులందరూ గౌరవించాలి. అందుకు తగిన విధంగానే నడుచుకోవాలి. "రాజ్యసభ ఛైర్మన్ అంటే సభకు అధ్యక్షత వహించడమే కాదు.. సభా సంరక్షుడు కూడా" అన్న వెంకయ్య.. 5 ఏళ్లలో చేసింది కూడా అదే. పారదర్శకత, జవాబుదారీతనాలకు పెద్దపీట వేస్తూ.. సభకే 'సమయం' నేర్పిన నేతగా ప్రశంసలు అందుకున్నారు ఈ తెలుగుజాతి ముద్దుబిడ్డ.

వెంకయ్యనాయుడు
వెంకయ్యనాయుడు

By

Published : Aug 9, 2022, 2:52 PM IST

పెద్దల సభకే 'సమయం' నేర్పిన నేత.. వెంకయ్యనాయుడు

venkaiah naidu journey as vice president : రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్యనాయుడు గడిచిన ఐదేళ్లలో ఏం చేశారు..? ఈ ప్రశ్నలకు ఆయన పనితీరు, సాధించిన ఫలితాలు, ప్రవేశ పెట్టిన సంస్కరణలే నిదర్శనం. సుదీర్ఘకాలం పాటు రాజకీయ నాయకుడిగా, పరిపాలకుడిగా తనకున్న అనుభవసారం మొత్తం ఉపయోగించి పెద్దల సభలో పెద్దన్నగా అందరితో ప్రశంసలు పొందారు.

రాజ్యసభ ఛైర్మన్ స్థానంలో కూర్చొని.. హితోక్తులు చెప్పడానికే పరిమితం కాలేదు వెంకయ్య నాయుడు. సభకు సమయం నేర్పారు. సభ, స్థాయీసంఘాలు ఎన్ని రోజులు.. ఎంతసేపు పని చేశాయన్న లెక్కలు తీసి జవాబుదారీతనాన్ని తీసుకొచ్చారు. సభ నిర్వహణలో తనదైన ప్రత్యేక ముద్ర వేశారు. అతి తక్కువ ఉత్పాదకతతో పని చేస్తున్న సభకు పునరుత్తేజాన్ని తెచ్చారు.

36 ఏళ్లలో ఇదే రికార్డ్​.. రాజ్యసభ ఛైర్మన్​గా వెంకయ్యనాయుడు ఇప్పటివరకు 13 పూర్తి సెషన్స్​కు నేతృత్వం వహించారు. 289 రోజులకు గానూ.. సభ 261 రోజులు సమావేశమైంది. 913 గంటల 11 నిమిషాలు సభ నడిచింది. ఈ 13 సెషన్స్​లలో 177 బిల్లులు ఆమోదం పొందాయి. 2019లో గరిష్ఠంగా 52 బిల్లులు సభామోదం పొందాయి. 36 ఏళ్లలో ఇదే గరిష్ఠం.

అడ్డంకులు లేవా అంటే.. ఎన్నో. వెంకయ్య హయాంలో 58 అంశాలు సభ కార్యకలాపాలకు ప్రధాన అడ్డంకిగా మారి వాయిదాకు దారితీశాయి. వాటిల్లో ముఖ్యమైనవి ఆంధ్రప్రదేశ్​కు ప్రత్యేక హోదా, సాగుచట్టాలు, పెగాసస్, కావేరీ జల యాజమాన్య బోర్డు, 2021 శీతాకాల సమావేశాల్లో 12 మంది ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్​ వంటివి. అవన్నీ పెద్దాయన సమర్థంగా అధిగమించారు.

పెరిగిన మాతృభాషల వాడకం.. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఎంపీలను వారి మాతృభాషల్లో మాట్లాడమని వెంకయ్యనాయుడు తరచూ ప్రోత్సహించారు. దాంతో 2004-17తో పోలిస్తే 2018-20 మధ్య సభలో భారతీయ భాషల వాడకం 4 రెట్లు పెరిగింది. 1952లో రాజ్యసభ ఏర్పడిన నాటి నుంచి సభలో వినిపించని డోగ్రీ, కశ్మీరీ, కొంకణి, సంతాలీ భాషలు 2020లో తొలిసారి వినిపించాయి. అస్సామీ, బోడో, గుజరాతీ, మైథిలి, మణిపురి భాషల్లోనూ చాలాకాలం తర్వాత మాట్లాడారు.

అలానే... స్థాయీ సంఘాలు. పార్లమెంటు స్థాయీ సంఘాలు 1993లో ఏర్పడినప్పటికీ 2019 వరకు వాటి పనితీరు ఎవరూ సమీక్షించలేదు. వెంకయ్యనాయుడు ఆ సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. 2017 ఆగస్టు నుంచి 2022 జూన్​ మధ్య 558 స్థాయీ సంఘాల సమావేశాలు జరిగాయి. వాటి పని గంటలు.. సభ్యుల హాజరు మెరుగుపడ్డాయి. ఇదే సమయంలో నేటితరం నాయకులు, యువతరానికి ఆయన ఎంతో విలువైన సందేశాలూ ఇచ్చారు.

తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక శ్రద్ధ.. వెంకయ్యనాయుడి రాజకీయ ప్రయాణంలో ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన మరో ముఖ్యమైన అంశం... ఆయన తెలుగు రాష్ట్రాలపై చూపిన ప్రత్యేక శ్రద్ధ. విభజన తర్వాత కూడా పరిపక్వ వైఖరి, వివేకాన్నీ ప్రదర్శించి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సామరస్య సంబంధాలకు అడ్డంగా నిలిచే సమస్యాత్మకమైన అనేక అంశాలను పరిష్కరించేలా చూశారు. ఉభయ రాష్ట్రాలకు న్యాయం చేసేందుకు కేంద్రమంత్రులందరితో తరచూ సమావేశాలు నిర్వహించి సూచనలు, సలహాలు ఇచ్చారు.

ఆయనకే సొంతమైన నిరాడంబరత.. మొత్తం మీద చూస్తే.. ఇవాళ ఎక్కడో దక్షిణాదిన మారుమూల గ్రామంలో ఉన్న వ్యక్తి.. జాతీయ రాజధానిలో నిలదొక్కుకోవడం, భారతదేశంలో ప్రభావశీలురైన నాయకుల్లో ఒకరుగా గుర్తింపు పొందడం భారత దేశ ప్రజాస్వామ్యం సాధించిన విజయం అని చెప్పక తప్పదు. అందుకే భారత 13వ ఉపరాష్ట్రపతిగా పదవిని అలంకరించిన ఆయన, ప్రజల ఉపరాష్ట్రపతిగా పేరు సంపాదించుకున్నారు. ఇదంతా నా గొప్పతనం కాదు, భారత ప్రజాస్వామ్య గొప్పతనం అని చెప్పగలిగిన నిరాడంబరత ఆయనకు మాత్రమే సొంతం. అందుకే ఆయన అందరివాడు అయ్యారు. తెలుగు వారంతా మా వాడని గర్వంగా చెప్పుకునే నాయకుడయ్యారు. భావితరాలకు స్ఫూర్తిని పంచుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details