'తెలుగుభాషాభివృద్ధి ఒక ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు ఇందుకోసం ప్రత్యేకంగా పోరాడాల్సిన అవసరం లేదు. పిల్లలకు మాతృభాష నేర్పడం తమ ఇంటినుంచే మొదలుపెడితే చాలు' అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉద్భోదించారు. తానా ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవంలో ఆయన శుక్రవారం రాత్రి దిల్లీ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కీలకోపన్యాసం చేశారు.
పిల్లలకు తల్లిపాలు ఇచ్చినంత బలం పోతపాలు ఇవ్వవన్నది ఎంత వాస్తవమో అమ్మ భాష ఇచ్చే పరిజ్ఞానం అన్యభాషలు ఇవ్వవన్నది అంతే సత్యం. ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు. మాతృభాష, మాతృమూర్తిని మరచిపోకూడదు. అమ్మభాషను ముందు తరాలకు అందించాలనే సదాశయంతో ప్రపంచ సాంస్కృతిక మహోత్సవాలకు శ్రీకారం చుట్టిన తానాకు అభినందనలు. మాతృభాష ప్రతి ఒక్కరి ఇంటిభాష కావాలి - వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి