పార్లమెంటు సమావేశాలకు సభ్యుల హాజరుపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. 10 శాతం సభ్యులూ ఉభయ సభలకు హాజరు కావడం లేదని, ప్రజలు ఎందుకు వారిని చట్ట సభలకు పంపుతున్నారో సభ్యులు ఆలోచించాలని ఉప రాష్ట్రపతి కోరారు. ప్రజలు ఆ తరహా నాయకుల్ని కాకుండా.. ప్రజా సమస్యలపై పోరాడేవారిని ఎన్నుకోవాలని సూచించారు. ఇటీవల పలు రాష్ట్రాల విధాన సభల్లో క్రమశిక్షణ కొరవడిందని.. రాజ్యసభలోనూ క్రమశిక్షణ గురించి చెప్పడం బాధగా అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తమ పార్లమెంటేరియన్ నూకల నరోత్తమ రెడ్డి శతజయంత్యుత్సవాల ప్రారంభ కార్యక్రమం.. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని బేగంపేట్‌లోని సెస్ ఆడిటోరియంలో నిర్వహించగా.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప రాష్ట్రపతి హాజరయ్యారు.
ఆయన సేవలు మరువలేనివి
నరోత్తమ రెడ్డి సమాజానికి చేసిన సేవలు మరువలేనివని.. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆయన పోరాడారని కొనియాడారు. సంగీతంలోనూ ఆయన ప్రావీణ్యం సాధించారని పేర్కొన్నారు. నేటితరం మన సంస్కృతి, సంప్రదాయాలను విస్మరిస్తున్నారన్న వెంకయ్య.. అది మంచిది కాదని వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తోందని... కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందు చూపుతో ఆలోచిస్తున్నాయన్నారు. కరోనా ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదని.. కొత్త పోకడలతో కరోనా వ్యాపిస్తోందని చెప్పారు. అందరూ మాస్క్, సామాజిక దూరం తప్పని సరిగా పాటించాలని సూచించారు.