Vegetable Prices Hike: కూరగాయలు ధరలు రోజురోజుకీ పైపైకి ఎగబాకుతున్నాయి. ఎండల తీవ్రతతో కూరగాయలు, ఆకుకూరల దిగుబడి తగ్గడం, పెరిగిన పెట్టుబడి వ్యయం, పెట్రో ధరల భారంతో రేట్లకు రెక్కలు వస్తున్నాయి. వారం క్రితం కిలో టమాట ధర వంద రూపాయలుంటే.... ఇపుడిప్పుడే దిగివస్తోంది. బీన్స్, చిక్కుడు, పచ్చిమిరప, క్యాప్సికం, నిమ్మకాయలు, బీర, బెండ ధరలూ మండిపోతున్నాయి. బెంబేలెత్తిస్తున్న ధరలతో కిలో తీసుకునే వారు అరకిలోతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. రోజువారీ కూలీలు, నిరుపేదలు మాత్రం ఏం కొనేటట్టు లేదని...ఏం తినలేపోతున్నామని బాధపడుతున్నారు.
జంటనగరాల్లోని రైతుబజార్లలోనూ కూరగాయల ధరలు ఠారెత్తిస్తున్నాయి. చాలీచాలని జీతాలతో నెట్టుకొచ్చే సామాన్య, మధ్యతరగతి వర్గాలు కొనే పరిస్థితి లేదని వాపోతున్నాయి. వంటింటి బడ్జెట్ అమాంతం పెరిగిపోతుందని గృహిణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రైతుబజార్లలోని బోర్డుల మీది రేట్లకంటే కొందరు ఎక్కువగా వసూలు చేస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.