Meals on TRS Plenary: ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ చేయాలంటేనే ఎంతో హడావుడి. కారం, మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్టు అంటూ నెల రోజుల ముందు నుంచే తలమునకలైపోతాం. అదే ఓ పదివేల మందికి వండి వార్చాలంటే ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి. తెరాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గతంలో హైదరాబాద్ కొంపల్లిలో నిర్వహించిన వేడుకల్లో పసందైన వంటకాలను సిద్ధం చేయించిన పార్టీ అధినేత కేసీఆర్.. ఈ సారి అంతకుమించిన రీతిలో వేడుకలకు వచ్చే ప్రతినిధులు, పోలీసు సిబ్బంది కోసం నోరూరించే వంటకాలు సిద్ధం చేయించారు. వెజ్, నాన్‌వెజ్, స్వీట్లు ఇలా మొత్తంగా 33 రకాల వంటకాలను విందు కోసం ఏర్పాటు చేయించారు. భోజన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.. సుమారు 10 నుంచి 12 వేల మందికి సరిపడా భోజన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలకు అనుగుణంగా.. అతిధులకు నచ్చేలా, వారు మెచ్చేలా ప్రత్యేక మెనూ సిద్ధం చేశారు. ఈ వేడుకల్లో వెజ్, నాన్‌వెజ్ వెరైటీలు ప్రత్యేకం. రోటి పచ్చళ్లతో ఘుమఘుమలాడించే వంటకాలు మెనూలో ఉన్నాయి. ఈ ప్లీనరీ విందులో తెలంగాణ రుచులతో పాటు రాయలసీమ రాగి సంకటి కూడా చోటు దక్కించుకుంది. టీతో మొదలయ్యి.. అల్పాహారం నుంచి భోజనానికి ముగింపునిచ్చే ఐస్‌క్రీమ్ వరకూ ప్లీనరీకి వచ్చే వారి కోసం 33 రకాల వంటలు సిద్ధం చేశారు.
- మాంసాహార ప్రియుల కోసం తొమ్మిది రకాల వంటకాలు వండారు. చికెన్ ధమ్ బిర్యాని, మటన్ కర్రీ, నాటు కోడి పులుసు, ఎగ్ మసాలా, మటన్ నల్లపొడి ఫ్రై, మటన్ దాల్చా, బోటి ఫ్రై, పాయా సూప్, తలకాయ పులుసు ప్రత్యేకంగా తయారుచేశారు. అందుకోసం 10 క్వింటాళ్ల మటన్, 10 క్వింటాళ్ల చికెన్, బిర్యానీ కోసం 10 క్వింటాళ్ల చికెన్, 6 క్వింటాళ్ల నాటు కోడి కూర, 10 వేల కోడిగుడ్లు తెప్పించారు. రంజాన్ మాసం సందర్భంగా ప్రత్యేకంగా హలీమ్ సైతం సిద్ధం చేశారు.
- వెజ్ వంటకాల్లో రోటీ పచ్చళ్లు, మూడు రకాల స్పెషల్ స్వీట్లు, గుత్తి వంకాయ కూర, జీడిపప్పు దట్టంగా జోడించిన బెండకాయ ఫ్రై.. వంటి కూరలతో ఘుమఘుమలాడించేలా వంటలు వండించారు. ప్రత్యేక వంటకంగా రాగి సంకటితో పాటు రుమాల్ రోటీ, ఆలూ క్యాప్సికం, బగారా రైస్, వెజ్ బిర్యానీ, వైట్ రైస్, చామగడ్డ పులుసు, మామిడికాయ పప్పు, పచ్చిపులుసు, ముద్దపప్పు, సాంబారు, ఉలవచారు వంటలు సిద్ధం చేశారు. రోటీ పచ్చళ్లుగా వంకాయ చట్నీ, బీరకాయ టమోటా చట్నీ, వెల్లుల్లి జీడిగుల్ల ఆవకాయ తయారుచేశారు.
- పెరుగు, పెరుగు చట్నీ, అందులో నంజుకోవడానికి వడియాలు, మిర్చి బజ్జీ చేయించారు. స్వీట్స్‌లో భాగంగా జిలేబీ, డబుల్‌కా మీటా, గులాబ్ జామ్‌ను ప్రత్యేకంగా తయారుచేశారు. భోజనం ముగిసిన తర్వాత చివరిగా ఐస్‌క్రీం అందించనున్నారు.