చంద్రమానం ప్రకారం తెలుగు సంవత్సరాదిలోని ఐదో నెల శ్రావణం. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైన ఈ మాసంలో ప్రతిరోజూ పండగలా జరుపుకుంటారు. అయితే శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం హిందూ ఆచారం. ఈ రోజు మహిళలు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు.
అంతే కాదు ఈ మాసంలో మంగళవారం శ్రావణ గౌరీ వ్రతం, శుక్రవారం మహాలక్ష్మీ పూజలు ఎంతో ప్రత్యేకం. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. వరలక్ష్మీ దేవత విష్ణు మూర్తికి భార్య. శ్రీమహావిష్ణువు దేవేరి మహాలక్ష్మీ అష్టవిధ రూపాలతో సర్వ మానవాళి కోరికలు తీరుస్తూ, ఎల్లవేళలా రక్షిస్తుందని భక్తుల నమ్మకం.