ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత బహిరంగలేఖ రాశారు. 24 అంశాలను లేఖలో ప్రస్తావించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల భద్రత కోసం దిశ చట్టం తీసుకొచ్చామని అసెంబ్లీలో చెప్పిన ముఖ్యమంత్రి.. ఆ చట్టాలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని లేఖలో వ్యాఖ్యానించారు. జనవరి 31 నాటికి అన్ని జిల్లాల్లో “దిశ” పోలీసుస్టేషన్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన సీఎం.. రెండు నెలల తర్వాత మొక్కుబడిగా రాజమహేంద్రవరంలో ఒక స్టేషన్ ప్రారంభించడం మహిళల భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని విమర్శించారు. 8 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 150 అత్యాచార కేసులు నమోదైతే వాటిలో ఎంతమందికి న్యాయం చేశారని ప్రశ్నించారు. ఎంతమంది నిందితులను అరెస్ట్ చేశారో చెప్పాలని నిలదీశారు.
అత్యాచార కేసులున్న వైకాపా నేతలపై చర్యలేవి?
వైకాపా నాయకులే దుశ్శాసునులుగా మారి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతుంటే వారిపై దిశ చట్టం కింద కేసులెందుకు పెట్టలేదని ప్రశ్నించారు అనిత. వైకాపాలోని 8 మంది సభ్యులపై అత్యాచార కేసులు ఉన్నవి వాస్తవం కాదా? అని ప్రశ్నిస్తూ.. వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ఎస్టీ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలున్న ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు. సొంత వదినను వేధించిన కేసులో నిందితుడిగా ఉన్న రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో దిశ పోలీసు స్టేషన్ ప్రారంభించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.