ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్​లో కొత్త టీకా టెస్టింగ్​ సెంటర్!

నెలరోజుల్లో.. హైదరాబాద్​లో కొత్త టీకా పరీక్ష కేంద్రం ఏర్పాటు కానుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి (KISHAN REDDY) ప్రకటించారు. పీఎం కేర్స్ నిధులతో వ్యాక్సిన్ టెస్టింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

KISHAN REDDY
కిషన్ రెడ్డి

By

Published : Jul 3, 2021, 5:25 PM IST

ప్రపంచ వ్యాక్సిన్‌ రాజధానిగా ప్రాధాన్యం సంతరించుకున్న హైదరాబాద్‌లో నెలరోజుల్లో టీకా టెస్టింగ్‌ కేంద్రం ఏర్పాటు కానుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి (KISHAN REDDY) ప్రకటించారు. పీఎం కేర్స్‌ నిధులతో టీకా టెస్టింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

హైదరాబాద్​కే తలమానికం

దేశంలో ప్రస్తుతం రెండు వ్యాక్సిన్‌ టెస్టింగ్‌ కేంద్రాలు మాత్రమే ఉన్నాయని కిషన్‌రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లో మూడోది ఏర్పాటు కాబోతోందని వెల్లడించారు. భాగ్యనగరం ఫార్మా, పరిశోధన సంస్థలకు కేంద్రంగా ఉందని... టెస్టింగ్ సెంటర్‌ తలమానికంగా మారుతుందని పేర్కొన్నారు. ఈ అవకాశం కల్పించిన ప్రధానికి కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

కేంద్రానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖలు..

వ్యాక్సిన్‌ టెస్టింగ్‌ ఏర్పాటు విషయమై ఇటీవలే.. కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమశాఖ మంత్రి హర్షవర్ధన్‌, కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి సదానందగౌడకు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ లేఖలు రాశారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ అంశంపై ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకోవాలని కోరారు.

సమయం ఆదా..

వ్యాక్సిన్ టెస్టింగ్​కు దాదాపు 30-50 రోజుల సమయం వృధా అవుతుండటం వల్ల టీకా ఉత్పత్తి నెమ్మదిస్తోందని.. అందుకోసమే హైదరాబాద్​లో టీకా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు కేంద్రం ముందుకొచ్చిందని కిషన్ రెడ్డి వెల్లడించారు. దాదాపు నెలరోజుల్లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

మొదటి స్థానంలో భారత్..

కేంద్ర ప్రభుత్వం.. డిసెంబర్ నాటికి దేశంలోని ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్​ను అందిస్తుందని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి తెలిపారు. అతి త్వరలో అత్యధిక మందికి టీకా అందించి ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కరోనా తగ్గినా.. నిబంధనలు తప్పనిసరి

జులై 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోందని కిషన్ రెడ్డి తెలిపారు. ఆరంభంలో టీకా వేసుకునేందుకు ఆసక్తి చూపని ప్రజల్లో.. రెండో దశ విజృంభించిన తర్వాత వ్యాక్సిన్​పై అవగాహన పెరిగిందని వెల్లడించారు. టీకా తీసుకోవడానికి ఇప్పుడు పెద్దఎత్తున ప్రజలు తరలివస్తున్నారని చెప్పారు. మూడో ముప్పు కూడా పొంచి ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెండో దశ అంతమైనా.. మాస్కు ధరించడం, శానిటైజర్ వాడకం, భౌతిక దూరం పాటించడం వంటి కరోనా నిబంధనలను తప్పకుండా పాటించాలన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో అమలవుతున్న కర్ఫ్యూ.. తగ్గని కొవిడ్ ఉద్ధృతి

ABOUT THE AUTHOR

...view details